అప్పుడు ఇస్తానంటే వొద్దని ఇప్పుడు అదే కావాలనుకుంటున్న తోట?

అప్పుడు ఇస్తానంటే వొద్దని ఇప్పుడు అదే కావాలనుకుంటున్న తోట?

నాడు పిలిచి టికెట్‌ ఇస్తానంటే మొహం చాటేశారు. ఇప్పుడు అదే కావాలని వెళ్లక తప్పలేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని వదులుకున్నారు. తన ప్రత్యర్థులు మంత్రులైనా ఆయనకు మాత్రం ఆ కోరిక తీరలేదు. ఇప్పుడు MLC పదవైనా వస్తుందో రాదో అన్న బెంగ పట్టుకుందట. ఇంతకీ ఎవరా నేత? ఏమా కథ? 

తోట త్రిమూర్తులు పరిస్థితి ఏంటి?

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబాబోస్‌ డిప్యూటీ సీఎం తర్వాత రాజ్యసభ సభ్యుడు అయ్యారు. సిటింగ్‌ ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు మంత్రిగా ప్రమోషన్‌ లభించింది. మరి.. ఇదే నియోజకవర్గానికి చెందిన తోట త్రిమూర్తులు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇదే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రిమూర్తులు వైసీపీలోనే ఉన్నా ఇంకా పదవీ యోగం లేదు. 

తోట వైసీపీలో చేరికతో పరిణామాలు మారిపోయాయా?

ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు తోట త్రిమూర్తులు  ప్రయత్నించారట. మండపేట టికెట్‌ ఇస్తామని వైసీపీ ఆఫర్‌ చేస్తే వెళ్లేందుకు నిరాకరించారని సమాచారం. దీంతో రామచంద్రపురంలోనే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు త్రిమూర్తులు. ఆపై తోట వైసీపీలో చేరిన తర్వాత  నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. నాటి డిప్యూటీ సీఎం బోస్‌ వెంట కార్యకర్తలు.. మిగతావారు త్రిమూర్తుల వెంట ఉండేవారు. ఎమ్మెల్యేగా వేణు చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి. 

మండపేట వైసీపీ ఇంఛార్జ్‌గా తోట త్రిమూర్తులు!

అమలాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా తోట త్రిమూర్తులను వైసీపీ నియమించినా... ఆయన మనసు రామచంద్రపురంపై ఉండేది. ఇది తట్టుకోలేని వేణు వర్గం ఓ దశలో త్రిమూర్తులపై భౌతిక దాడులకు దిగడం.. తోట వర్గీయులు కూడా  ప్రతిదాడులు చేయడంతో కలవరం రేపింది. ఈ వర్గపోరుకు చెక్‌పెట్టాలని అనుకుంటున్న సమయంలో రాజకీయ పరిణామాలు వైసీపీకి కలిసి వచ్చాయి. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపడంతో వేణగోపాల్‌ను కేబినెట్‌లోకి తీసుకుంది. త్రిమూర్తులను మండపేటకు వైసీపీ ఇంఛార్జ్‌గా నియమించింది. ఆ విధంగా రామచంద్రపురంలో ఆధిపత్యపోరుకు తెరదించింది. 

తోటకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం!

అయితే ఎన్నికల ముందు వద్దని అనుకున్న మండపేటకే త్రిమూర్తులు అయిష్టంగానే వెళ్లక తప్పలేదట. పార్టీ పెద్దల నిర్ణయానికి అనుకూలంగా నడుచుకుంటే పదవులు వాటి అంతట అవే వస్తాయని అనుకున్నారో ఏమో.. ఆయన మండపేటలో అడుగుపెట్టగానే ప్రజలు, అధికారులు, పోలీసులు బ్రహ్మరథం పట్టారు. త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం మొదలైంది. అయితే రాజకీయంగా, వ్యాపారపరంగా తనకు మంచి మిత్రుడైన మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఎలా ఢీకొడతారన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. 

ఎమ్మెల్సీ అయినా మంత్రి పదవి డౌటేనా?

ఎన్నికలకు ముందే వైసీపీలో చేరి మండపేట నుంచి పోటీ చేసి గెలిచి ఉంటే.. జీవితంలో ఒక్కసారైనా మంత్రి కావాలన్న తోట త్రిమూర్తులు ఆశ నెరవేరి ఉండేదని సన్నిహితులు అనుకుంటున్నారట. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా టీడీపీలో చంద్రబాబు ఆయన కోరిక తీర్చలేదు. భవిష్యత్‌లో ఎమ్మెల్సీని చేసినా YCPలోనూ మంత్రి పదవి డౌటే అని అనుకుంటున్నారట.  

జిల్లాలోని కాపు నేతల నుంచే తోటకు పోటీ!

రామచంద్రపురం లెక్క తీసుకుంటే.. పిల్లి సుభాష్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వేణుగోపాల్‌ మంత్రి అయ్యారు. అలాంటప్పుడు త్రిమూర్తులకు ఇవ్వకపోవచ్చని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. అలాగే జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన కురసాల కన్నబాబు మంత్రిగా ఉన్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి కన్నబాబును పక్కనపెట్టినా ఇదే సామాజికవర్గానికి చెందిన దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజా, పెండెం దొరబాబు ఉన్నారు.  ఈ ముగ్గురు నుంచీ పోటీ ఉండొచ్చని అంటున్నారు. ఆలోగా కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెడతారని టాక్‌. మొత్తానికి పేటలో తోట ఏ మేరకు రాణిస్తారో చూడాలి.