ఉచిత వైఫైతో రైల్వే కూలీ సక్సెస్‌

ఉచిత వైఫైతో రైల్వే కూలీ సక్సెస్‌

పట్టుదల ఉంటే పట్టుకొమ్మ అదే దొరుకుతుందని అన్నాడో సినీ కవి. ఈ వ్యాఖ్యలను నిజం చేశాడు ఓ రైల్వే కూలీ. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న వైఫై సౌకర్యాన్ని శ్రీనాథ్‌ అనే రైల్వే కూలీ తన చదువు కోసం ఉపయోగించుకుని కేరళ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాడు. శ్రీనాథ్ తన కుటుంబ పోషణ కోసం గత ఐదేళ్లుగా కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్నాడు.  స్నేహితుల సూచన మేరకు  ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి.. రైల్వే స్టేషన్లోని ఫ్రీ వైఫైకి కనెక్ట్‌ అయ్యాడు. ఆ వైఫై సహాయంతో ఇంటర్నెట్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన మెటీరియల్‌ను కలెక్ట్ చేశాడు. కొన్ని ఆడియోలను, వీడియోలను సేకరించాడు. తోటి కూలీల మాదిరిగా కాకుండా... ఓ వైపు లగేజీ మోస్తూనే మరోవైపు  ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాఠాలు వినేవాడు. ఫలితంగా ఇటీవలే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన విలేజ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హత సాధించాడు . ఇక.. త్వరలో జరిగే ఇంటర్వ్యూలో నెగ్గితే అతనికి ప్రభుత్వోద్యోగం వచ్చినట్టే.. అందుకే అంటారు.. మనసుంటే మార్గం ఉంటుందని..