గత 73 ఏళ్లుగా దేశంలోని ఆ మూడు గ్రామాలకు కరెంట్ లేదు...

గత 73 ఏళ్లుగా దేశంలోని ఆ మూడు గ్రామాలకు కరెంట్ లేదు...

దేశంలో మారుమూల గ్రామాలకు కూడా కరెంట్ రోడ్డు సౌకర్యం ఉన్నది.  కొండల ప్రాంతాల్లో ఉండే వాళ్లకు కూడా ఈ సౌకర్యాలు ఉన్నాయి.  ఇప్పుడు దేశంలో కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయా అంటే లేవని చెప్తాం.  కానీ దేశంలోని ఓ మూడు గ్రామాల్లో గత 73 ఏళ్లుగా కరెంట్ లేదు.  అక్కడ కరెంట్ సౌకర్యం కల్పించే విద్యుత్ తీగలు వేయడం ప్రాణాలతో చెలగాటం ఆడటం వంటిది.  

ఇంతకీ ఆ మూడు గ్రామాలు ఎక్కడ ఉన్నాయని అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నా... ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి కెరన్, ముండియన్, పట్రారు గ్రామాలు ఉన్నాయి.  ఈ గ్రామాల్లో మొత్తం 14 వేలమంది నివసిస్తున్నారు.  నియంత్రణ రేఖకు 500 మీటర్ల దూరంలోనే ఈ గ్రామాలు ఉన్నాయి. శీతాకాలంలో మంచు కురవడం వలన ఈ మూడు గ్రామాలు మిగతా ప్రాంతాలకు దూరంగా ఉండిపోతాయి. మిగతా రోజుల్లో నిత్యం తుపాకుల మోతతో దద్దరిల్లిపోతుంది.  ఈ గ్రామాలకు కరెంట్ సౌకర్యం కల్పించడం అంటే మాములు విషయం కాదు.  కాశ్మీర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎలాగైనా ఆ గ్రామాలు కరెంట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో 33 కేవీ లైన్, సుబ స్టేషన్ ను అక్కడ ఏర్పాటు చేసింది.  కొండలు, లోయలు గుట్టలతో కూడిన ఈ ప్రదేశంలో హైటెన్షన్ వైర్లు వేసేందుకు మొత్తం 979 స్తంభాలను ఏర్పాటు చేసింది.  73 ఏళ్లుగా చీకటిలో ఉండిపోయిన ఈ గ్రామాల్లోకి ఇప్పుడు వెలుగు రాబోతున్నది.