రాయలసీమకు భారీ వర్ష సూచన 

రాయలసీమకు భారీ వర్ష సూచన 

బంగాళాఖాతంలో తెల్లవారుజామున తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో మధ్య బంగాళా ఖాతాన్ని కలుపుకొని ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా తీవ్ర వాయుగుండం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపానుకు ‘గజ తుపాను’గా ఐఎండీ నామకరణం చేసింది. ప్రస్తుతం తుపాను పోర్ట్ బ్లెయిర్ కు 203 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తుపానుగా బలపడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఆ తర్వాత 13 వ తేదీ తెల్లవారు జామున 5.30 గంటల  సమయంలో తీవ్ర తుపానుగా  రూపుదాల్చుతుందని అంచనా వేస్తున్నారు. సోమవారంలోపు అది పశ్చిమ ఆగ్నేయ దిశగా, అనంతరం 72 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపుగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని కారణంగా తమిళనాడు తీరం, దక్షిణ కోస్తాంద్రల్లో పలుచోట్ల ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.