జూలై 1నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న పాఠశాలలు..మార్గదర్శకాలు ఇవే...!

 జూలై 1నుంచి తెలంగాణలో తెరుచుకోనున్న పాఠశాలలు..మార్గదర్శకాలు ఇవే...!

మరో నెల రోజుల్లో తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. జూలై 1 నుంచి ఉన్నత పాఠశాలలను, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2020-21 విద్యా సంవత్సరానికిగాను మార్గదర్శకాలను విడుదల చేసింది విద్యాశాఖ. ఒక తరగతి గదిలో 15 మంది విద్యార్థులకు మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల గ్రౌండ్, క్లాస్‌ రూముల్లో తప్పనిసరిగా భౌతికదూరం పాటించాల్సిందేనని, మాస్క్‌లు, శానిటైజర్‌ వాడకాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలని తెలిపింది విద్యాశాఖ.

2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకే పరిమితం చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షను మాత్రమే నిర్వహించాలని  నిర్ణయించింది.  విద్యాశాఖ  మార్గదర్శకాలనుసారం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లల్లో షిఫ్ట్‌ల పద్దతిలో క్లాసులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో ఆదివారం, సోమవారం సెలవు ఉంటుంది. రెండో శనివారం మాత్రం సెలవు ఉండదు. ప్రైమరీ సెక్షన్‌ సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. ఎనిమిది నుంచి 10వ తరగతి వరకు  ప్రతీ రోజూ క్లాసులు ఉంటాయి. స్కూళ్లల్లో ఎలాంటి ఆటలకూ అనుమతి లేదు.