ఐటీ ఎగుమతుల్లో మరోసారి సత్తా చాటిన తెలంగాణ

ఐటీ ఎగుమతుల్లో మరోసారి సత్తా చాటిన తెలంగాణ

ఐటీలో తను మేటని మరోసారి చాటిచెప్పింది తెలంగాణ. ఎగుమతుల్లో గణనీయమైన గ్రోత్ రేట్ కనబర్చింది. గతేడాదితో పోలిస్తే 17.93 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. జాతీయ వృద్ధి రేటు 8.09 శాతంగా మాత్రమేగానే ఉంది. అంటే జాతీయ వృద్ధిరేటు కన్నా తెలంగాణ రెండింతలు వృద్ధిరేటు సాధించింది. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2018-19లో 1,09,219 కోట్లు ఉండగా.. అది 2019-20లో 1,28,807కోట్లకు పెరిగింది. ఇక తెలంగాణ ఐటీలో ఉద్యోగ వృద్ధిరేటు 7.2 శాతం ఉండగా.. జాతీయ సగటు మాత్రం 4.93 శాతంగా ఉంది.. అంటే ఎంప్లాయిమెంట్‌లోను తెలంగాణ టాప్‌లో ఉంది. జాతీయస్థాయి ఎగుమతుల్లో తెలంగాణ వాటా 23.53 శాతంగా ఉంది. ఎంప్లాయిమెంట్ గ్రోత్‌లో తెలంగాణ వాటా 19.07 శాతంగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరం నివేదికను ఐటీ మంత్రి కేటీఆర్‌.. శాఖాధికారులతో కలిసి సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. మంచి గ్రోత్ రేట్ సాధించినందుకు సీఎం కేసీఆర్.. ఐటీ శాఖను అభినందించారు.

కరోనాను దృష్టిలో పెట్టుకొని ఐటీ పరిశ్రమ ముందుకు సాగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. చివరి త్రైమాసికంలో కరోన ప్రభావం ఉన్నప్పటికీ ఐటీ ఎగుమతుల్లో రికార్డ్ సాధించామని మంత్రి కేటీఆర్‌ సీఎంకు వివరించారు. చాలా ఐటీ సంస్థలు కరోనా పై పోరాడేందుకు ముందుకు వచ్చాయని.. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ లాంటివి అందించాయని.. మొత్తానికి ఐటీ వైపు నుంచి 70 కోట్ల సహాయం అందిందని తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకువస్తున్నాయని, కొన్ని చర్చల దశలో ఉన్నాయని చెప్పారు. త్వరలోనే కొన్ని అనౌన్స్‌మెంట్స్ ఉంటాయని కేటీఆర్ తెలిపారు.