బాగ్దాద్ లో బందీలుగా తెలంగాణ వాసులు

బాగ్దాద్ లో బందీలుగా తెలంగాణ వాసులు

ఐఎస్‌ ఉగ్రవాదులు ఎక్కువగా ఉండే బాగ్దాద్‌ సరిహద్దు ప్రాంతమైన కిర్గ్‌ లో తెలంగాణ వాసులు చిక్కుకుపోయారు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీ చెరలో 15మంది వరకు ఉన్నారు. వీరంతా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం ఇరాక్‌ వెళ్లినవారే. ఎర్బిల్‌లో మంచి ఉపాధి చూపిస్తామంటూ ఏజెంట్లు వీరిని నమ్మబలికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత స్థానిక ఏజెంట్లు ఇరాక్‌లో పని చూపించకుండా ఐఎస్‌ ఉగ్రవాదులు సంచరించే కిర్గ్‌లోని ప్రైవేటు కంపెనీకి తమను గంపగుత్తగా విక్రయించారని బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు. ఆ కంపెనీ వాళ్లు తనకు పని కల్పించకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని, తమకు రాని నమాజ్‌ చేయాలంటూ దాడులు చేస్తున్నారని బాధితులు వాపోయారు. కిర్గ్‌ ప్రాంతంలో ఎప్పుడూ తీవ్రవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో 15 మంది తెలంగాణ యువకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకీడుస్తున్నారు.  తిరిగి స్వదేశానికి వెళ్దామంటే కంపెనీ వారు పాసుపోర్టులు లాక్కున్నారని బాధితులు వాపోతున్నారు. ఇరాక్‌కు వచ్చిన గడువు కూడా ముగిసిపోవడంతో అక్కడి ప్రభుత్వం తమను జైల్లో పెడుతుందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని తమను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని బాధితులు వాపోతున్నారు.