నల్గొండ అభివృద్ధికి రూ.100 కోట్లు

నల్గొండ అభివృద్ధికి రూ.100 కోట్లు

తెలంగాణలో నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ నిధులతో నల్గొండ పట్టణాన్ని హైదరాబాద్‌ లా సుందరీకరించాలని.. ఆయన అధికారులను ఆదేశించారు. 

కేటీఆర్ హైదరాబాద్‌లో నల్గొండ పట్టణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్గొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంచర్ల భూపాల్‌రెడ్డిలతోపాటు..నల్గొండ పురపాలక సంఘం తెరాస ఫ్లోర్‌ లీడర్‌ అభిమన్యు శ్రీనివాస్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ భేటీలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. నల్గొండ పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, అందుకు అనుగుణంగా అవసరమైన నిధులను ఇస్తున్నామన్నారు. ప్రణాళికబద్ధంగా వీటిని వినియోగించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో రహదారుల నిర్మాణం, కూడళ్ల అభివృద్ధి, ఉద్యానవనాల నవీకరణ, మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం, శ్మశాన వాటికల మరమ్మతుల పనులు వెంటనే చేపట్టాలని కేటీఆర్ సూచించారు.