'రైతు బంధు'ను తీసే దమ్ముందా...

'రైతు బంధు'ను తీసే దమ్ముందా...

ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మింగుడు పడకే కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'రైతు బంధు' పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... అనంతరం ఓదెలలో మాట్లాడుతూ... రైతు బంధు ఎలక్షన్ స్టంట్ కాదు. ఈ పథకాన్ని తీసివేసే దమ్ము ఎవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రతి సంక్షేమ పథకాన్ని విమర్శించడం కాంగ్రెస్‌ నేతలకు అలవాటైపోయిందని ఆయన మండిపడ్డారు. 

కాంగ్రెస్ హయాంలో రూ.3,380 కోట్ల రుణ మాఫీ చేస్తే... మా పార్టీ కాకపోయినా రైతుల కోసం మంచి పథకమని మద్దతిచ్చాం... కానీ, మేం రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేసి, రైతులకు పెట్టుబడిసాయం చేస్తుండడంతో మింగుడుపడకే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో స్కామ్ లు జరిగితే... మా హయాంలో స్కీమ్‌లు తెస్తున్నామన్న ఈటల... నదులు, వాగులపై చెక్ డ్యామ్ లు కట్టి వ్యవసాయానికి అండగా నిలుస్తున్నామన్నారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్న మంత్రి... చివరకు ప్రధాని నరేంద్ర మోదీ... ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్ లో కూడా 24 గంటల కరెంట్ లేదన్నారు.