కీల‌క నిర్ణ‌యం.. కామ‌న్ ఎంట్రెన్స్ టెస్టుల‌న్నీ వాయిదా

కీల‌క నిర్ణ‌యం.. కామ‌న్ ఎంట్రెన్స్ టెస్టుల‌న్నీ వాయిదా

కామ‌న్ ఎంట్రెన్స్ టెస్టుల‌పై తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది... అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్న‌ట్టు హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర స‌ర్కార్.. రేపటి నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖ‌లైన పిల్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.. హైదరాబాద్‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవ‌కాశాలు ఎంత వ‌ర‌కు ఉన్నాయ‌ని ఆరా తీసిన హైకోర్టు.. ఒకవేళ లాక్ డౌన్ ఉంటే ప‌రీక్ష‌లు ఎలా నిర్వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించింది.. హైదరాబాద్‌లో లాక్ డౌన్ అవకాశాలపై కొంత స్పష్టత ఇవ్వాల‌ని ఏజీని కోరింది హైకోర్టు.. అయితే, లాక్‌డౌన్ కేబినెట్ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంద‌ని కోర్టుకు తెలిపిన ఏజీ.. ఒకటి, రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం ఉంటుంద‌న్నారు.. ప్రవేశ పరీక్షల వాయిదాపై మధ్యాహ్నం 2.30కి నిర్ణయం చెబుతామ‌న్నారు.. ఎంట్రన్స్ ల వాయిదా అవకాశాలపై అధికారులతో సీఎస్ చర్చిస్తారని కోర్టుకు తెలిపారు ఏజీ.. దీంతో.. విచార‌ణ మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు వాయిదా ప‌డింది.. 

మ‌రోవైపు.. విద్యా శాఖ అధికారులతో స‌మావేశ‌మైన తెలంగాణ సీఎస్.. కామన్ ఎంట్రెన్స్ పరీక్షల పై చ‌ర్చించారు.. మ‌ధ్యాహ్నం 2.30కి కోర్టుకు స‌మాధానం చెప్పాల్సి ఉన్న నేప‌థ్యంలో అధికారుల‌తో చ‌ర్చించారు.. ఈ స‌మావేశంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్.. కామ‌న్ ఎంట్రెన్స్ టెస్టులు అన్నీ వాయిదా వే‌యాల‌ని నిర్ణ‌యించారు. ఇదే విష‌యాన్ని ఏజీ ద్వారా హైకోర్టుకు తెలియ‌జేసింది.. జులై 1వ తేదీ నుంచి ఈ నెల 15 వరకు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వ‌హించేందుకు తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి షెడ్యూల్ ఖ‌రారు చేయ‌గా.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో అన్ని ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.