కరోనా చాలా పద్ధతులు నేర్పింది-గవర్నర్

 కరోనా చాలా పద్ధతులు నేర్పింది-గవర్నర్

కరోనా ప్రజలకు చాలా పద్ధతులు నేర్పింది.. సాంప్రదాయాలను మళ్లీ పాటించేలా చేసిందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐలో కరోనా సమయంలో పేషేంట్లకు సేవ చేస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని సన్మానించిన ఆమె.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం.. ఈ సమయంలో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ఈఎస్‌ఐ, డీఆర్‌డీఓ కలిసి కరోనాను ఎదుర్కొనేందుకు పరిశోధనలు చేస్తున్నాయని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది ముందుండి కరోనాతో పోరాడుతున్నారన్న గవర్నర్.. కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచంలో భారత్‌ ముందుందని గుర్తుచేశారు. వైద్యులు అంకితభావంతో పని చేస్తున్నారు.. అందుకే దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందన్నారు. 

ఇక, లాక్‌డౌన్‌ విధించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించగలిగాం అన్నారు గవర్నర్ తమిళిసై.. అయితే, ఈ సమయంలో కరోనా లేని, సాధారణ రోగులను కాపాడుకోవాలని సూచించారు. మరోవైపు.. కరోనా చాలా పద్ధతులు నేర్పిందన్నారు.. వైరస్ బారిన పడకుండా మన సాంప్రదాయాలను గుర్తుచేసిందన్న ఆమె..  అప్పట్లో బయటకి వెళ్తే, కాళ్లు, చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి రానిచ్చేవారు కాదు మా బామ్మ అని గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనావైరస్ కట్టడి విషయంలో కలిసి కట్టుగా పని చేస్తున్నాయని తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.