60ఏళ్ల సుదీర్ఘ పోరాటం..కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష...!

60ఏళ్ల సుదీర్ఘ పోరాటం..కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష...!

గోస నుంచి మొదలైంది... సముద్ర ఘోషలా  నినదించింది.  ఉత్తుంగ తరంగమై ఎగిసింది... ఉద్యమ సునామీలా నిలిచింది.. ! 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం... 6 ఏళ్ల స్వయంపాలన..అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న తెలంగాణకు సజీవ రూపాలు. ఒకప్పటి దిక్కుతోచని తెలంగాణ ..నేడు దేశానికే దిక్సూచీ .  ఆరేళ్ల అతిచిన్న ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు ! నీళ్లు, నిధులు, నియామకాలే ..రణన్నినాదాలై ...తెలంగాణ కలసాకారానికి ఊపిరైన చారిత్రక  ఘట్టం. తొలి దశ నుంచి మలిదశ దాకా.. మలి దశ మొదలు గమ్యాన్ని ముద్దాడేదాకా ..తెలంగాణ ఆవిర్బావానికి ఎదురైన సవాళ్లేమిటి? వాటిని తెలంగాణ సమాజం ఎలా ఎదుర్కొంది?

జూన్‌ 2.. తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోనూ ఒక ప్రత్యేకమైన రోజు. నాలుగున్నర  కోట్ల తెలంగాణ ప్రజల.. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన రోజు. భారతదేశ చరిత్రలో మరో కొత్త రాష్ట్రంగా..  2014 జూన్‌2న తెలంగాణ ఆవిర్భవించింది. ఆరేళ్ల అవతరణ సంబరాలు వెనక..అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఉంది. ముఖ్యంగా 14 ఏళ్ల కేసీఆర్ అలుపెరగని ఉద్యమ స్ఫూర్తి ఉంది...లక్ష్యసాధన  కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడని మనోధైర్యం ఉంది. నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు సామ, దాన, బేధ దండోపాయాలను ప్రయోగించిన
రాజకీయ చాణక్యం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఒక్కడిగా మొదలై...అనంతంగా సాగిన యుద్ధతంత్రం ఉంది.

60 ఏళ్ల తొలిదశ ఉద్యమం తర్వాత 14 ఏళ్ల మలిదశ యుద్ధానికి ఊపిర్లూది.. తెలంగాణను ఉద్యమబాట  పట్టించిన  నాయకుడు కేసీఆర్. ఇందులో రెండో ఆలోచనే లేదు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మొక్కవోని కార్యదీక్షకు కేరాఫ్ గా నిలిచిన కేసీఆర్ 2009 నాటి దీక్ష ... ఉద్యమాన్ని పతాకస్థాయికి చేర్చింది. ప్రత్యేక రాష్ట్రమా...? ప్రాణమా... ? అన్నట్టు సాగిన తన ఉద్యమ యుద్ధాన్ని .. గులాబీ సారథి  .. గమ్యాన్ని ముద్దాడేదాకా... వీడలేదు.

ఒకటి కాదు, రెండు కాదు.. తెలంగాణకు జాతీయ స్థాయిలో నలభైకి పైగా పార్టీలు జైకొట్టాయంటే.. అది ఆషామాషీ వ్యవహారం కాదు. అదంతా ఊరికే.. ఒక్క రోజులో జరిగిన మ్యాజిక్  కాదు. దీని వెనుక దశాబ్దంపైగా వ్యూహం ఉంది... ఆ వ్యూహాన్ని అమలుచేసిన చాణక్యం ఉంది.  తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడ్డం ఒకఎత్తైతే... ఆయనకు మద్దతుగా జాతీయనాయకులు గళం  కలపడం మరో ఎత్తు.


ఆరేళ్లంటే ... ఒక కొత్త రాష్ట్రానికి చాలా తక్కువ సమయం. కానీ.. తెలంగాణకు కాదు. అస్తిత్వ పోరాటంలో  రాటుదేలిన  తెలంగాణ.. కేవలం ఆరేళ్లలో తానేంటో నిరూపించుకుంది. కార్యదక్షత , దూరదృష్టి ఉన్న ఉద్యమనేతగా... కేసీఆర్.. తెలంగాణను తిరుగులేని  అభివృద్ధికి  కేంద్రంగా తీర్చిదిద్దారు. ఒక్కో అడుగు, ఒక్కో మలుపు, ఒక్కో వ్యూహం, ఒక్కో లక్ష్యం...ఇలా సాగిన కేసీఆర్  ప్రగతి ప్రణాళిక...నాలుగున్న కోట్ల తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టింది.