ఓయూ విద్యార్థికి ఉగ్రవాద లింకులు..విచారిస్తున్న ఎన్‌ఐఏ

ఓయూ విద్యార్థికి ఉగ్రవాద లింకులు..విచారిస్తున్న ఎన్‌ఐఏ

హైదరాబాదీ జుబేర్‌ అల్‌-ఖాయిదా ఉగ్రవాదిగా ఎలా మారాడు? దేశద్రోహం వంటి నేరాలతో అతడిని భారత్‌కు తిప్పిపంపింది అమెరికా. ఇప్పుడు భారత నిఘా సంస్ధ, జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని ప్రశ్నిస్తున్నాయి. భారత్‌లో అతడిపై ఎలాంటి కేసులు లేకున్నా..  ఇక్కడ అల్‌-ఖాయిదా కార్యకలాపాల వివరాలను రాబడుతున్నాయి. ఈ దర్యాప్తులో జుబేర్‌ నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. జుబేర్‌ 2001లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నాడు. అప్పటికే అతడి సోదరుడు ఫరూఖ్‌ మహమ్మద్‌ అమెరికాలో స్థిరపడటంతో.. ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయి్‌సలో చేరాడు. 2005లో అతడి విద్యాభ్యాసం పూర్తవ్వడంతో.. టెక్సాస్‌లో స్థిరపడ్డ తన తల్లిదండ్రుల వద్దే ఉన్నాడు. 2006లో అమెరికాకు చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకుని, 2007లో చట్టబద్ధంగా ఆ దేశ పౌరసత్వాన్ని పొందాడు. ఆ తర్వాత ఇంటర్నెట్‌లో అల్‌-ఖాయిదా అగ్రనేత.. అల్‌-అవ్లాఖీ ఉపన్యాసాలు విని, ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. జుబేర్‌ సోదరుడు ఫరూఖ్‌, మరో ఇద్దరు.. అల్‌-అవ్లాఖీని కలిసేందుకు యెమన్‌కు వెళ్లారు. అతడిని కలుసుకోలేకపోయినా.. అల్‌-ఖాయిదా లింకులను పట్టుకోగలిగారు. జుబేర్‌ కూడా అమెరికాకు వ్యతిరేకంగా జిహాద్‌లో భాగస్వాముడయ్యాడు జుబేద్‌. ఆ తర్వాత ఉగ్ర నిధుల సమీకరణ బాధ్యతలు చేపట్టాడు.

ఉగ్రవాది అల్‌-అవ్లాఖీని మట్టుబెట్టాక.. అతడి లింకులను ఒక్కొక్కటిగా వెలికి తీశారు అమెరికా పోలీసులు. జుబేర్‌ ఆన్‌లైన్‌ ద్వారా 22వేల డాలర్లను ఉగ్రవాదులకు బదిలీ చేసినట్లు తేలింది. దీంతో.. జుబేర్‌ సోదరులు 2011లో అరెస్టయ్యారు. 2018లో జుబేర్‌పై నేరం రుజువవ్వడంతో.. కోర్టు అతడికి 60నెలల ఖైదు విధించింది. కరోనా ఎఫెక్ట్‌తో ఖైదీల క్షమాభిక్షకు సిద్ధమైంది అమెరికా సర్కారు. తక్కువ శిక్షాకాలం ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేసింది. దీంతో జుబేర్‌ విడుదలయ్యాడు. అయితే.. దేశద్రోహం వంటి అభియోగాలు ఉండటంతో.. అమెరికా సర్కారు గురువారం అతడిని భారత్‌కు తిప్పి పంపింది. ప్రస్తుతం అమృత్‌సర్‌లో క్వారంటైన్‌లో ఉన్న జుబేర్‌ను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లో అల్‌-ఖాయిదా నెట్‌వర్క్‌ను ఎవరు నడుపుతున్నారు? జుబేర్‌కు ఏయే దేశాల ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే విషయాలను రాబడుతున్నారు.