టీఆర్ఎస్, కాంగ్రెస్ కవలపిల్లలు!

టీఆర్ఎస్, కాంగ్రెస్ కవలపిల్లలు!

తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్), కాంగ్రెస్ పార్టీ కవల పిల్లలు అని... టీఆర్ఎస్‌కు ఓటువేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే అని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్... టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తోన్న ఉద్యమాలు బూటకమే అని విమర్శించిన ఆయన.. ఆ రెండు పార్టీలు కలిసిపోతాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి పావుగా టీఆర్ఎస్ మారిందని వ్యాఖ్యానించి లక్ష్మణ్... సీఎం కేసీఆర్ మద్దతిచ్చిన జేడీఎస్ ఈ రోజు కాంగ్రెస్‌తో కలిసి పోతుంటే ఆయన ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు బస కల్పించి, కావాల్సిన ఏర్పాట్లు చేసింది కేసీఆరే అని ఆరోపించారు. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ ఒక వైపు మిగిలిన పార్టీలన్నీ మరోవైపు అనే పరిస్థితి వచ్చిందన్నారు లక్ష్మణ్... ఒంటరిగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేని కాంగ్రెస్ పార్టీ... వైరుద్యాలున్నా మిగతా పార్టీలతో కలిసి బీజేపీని ఎదుర్కోవాలని అనుకుంటోందన్నారు. ఇక టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని స్పష్టం చేసిన ఆయన... సంక్షేమ పథకాలు గులాబీ దండుకే పరిమితం అయ్యాయని మండిపడ్డారు. కర్ణాటకలో సీఎం పదవిని తాకట్టుపెట్టి కాంగ్రెస్... జేడీఎస్ ను లోబర్చుకుందని విమర్శించారు లక్ష్మణ్... అందుకే మేం ప్రజల్ని అలెర్ట్ చేస్తున్నాం... కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ ఎక్కువ కాలం కొనసాగదన్నారు. ఇప్పటికే పదవుల కోసం గొడవ ప్రారంభమైందని... ఆ సర్కార్‌ ఎంతో కాలం ఉండదన్నారు. కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్ ని తిరస్కరించి బీజేపీని గెలిపించారని... గవర్నర్ ఆదేశంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన యడ్యూరప్పను కుట్రలతో కాంగ్రెస్, జేడీఎస్ కొనసాగనివ్వలేని మండిపడ్డారు. ఈ కుట్రలో తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా భాగస్వాములయ్యారని ఆరోపించారాయన.