ఈ నెల 25 నుంచి బదిలీల ప్రక్రియ

ఈ నెల 25 నుంచి బదిలీల ప్రక్రియ

ఉద్యోగుల బదిలీల కోసం ఏర్పాటు చేసిన అజయ్‌మిశ్రా కమిటీతో ఉద్యోగ జేఏసీ నాయకులు శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల నేతలతో  చర్చించిన తర్వాత అజయ్‌మిశ్రా కమిటీ తెలంగాణ సీఎంకు నివేదిక ఇవ్వనుంది. అనంతరం సీఎం సూచనల మేరకు ప్రభుత్వ సీఎస్ మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఈ నెల 22న మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. 25 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమవనుంది. ఈ బదిలీలలో యాభై శాతం మంది ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వ కమిటీ నిర్ణయించింది. భార్యాభర్తలకు, వ్యాధిగ్రస్తులకు, పదవీవిరమణకు దగ్గరగా ఉన్న వారికి ఈ బదిలీల నుండి మినహాయింపు ఇవ్వనున్నారు.

ముందుగా టీచర్ల బదిలీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల బదిలీల కమిటీ చైర్మన్ అజయ్‌మిశ్రాతో పాటు కమిటీ సభ్యులు ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ బదిలీల ప్రక్రియలో ఎలాంటి అవినీతికి తావు ఇవ్వవద్దని ఉద్యోగ జేఏసీ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఇదివరలోగా 20% మాత్రమే బదిలీలు చేయకుండా... అర్హులైన ప్రతీ ఉద్యోగినీ బదిలీ చేయాలని కోరారు. ఒకే ప్రాంతంలో ఎక్కువకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారు కోరుకున్న చోటుకు బదిలీ చేయాలని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పద్మాచారి విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లో చాలాకాలంగా పనిచేస్తున్నవారిని బదిలీ చేయాలని.. అక్కడికి బదిలీ అయ్యేవారి సమస్యలను కూడా పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.