తిరుగుబావుటా

తిరుగుబావుటా

అవును...

ప్రధాని న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నాలుగేళ్లు కేంద్రం చెప్పిన‌ట్టు న‌డుచుకున్న చంద్రబాబు ఇకపై కేంద్రమాటలకు తల ఊపే ప్రసక్తే లేదని తిరుగుబావుట ఎగురవేశారు. బెజవాడలో జరుగుతున్న మహానాడు వేదికగా చంద్రబాబు కేంద్రంపై కత్తులు దూశారు. చంద్రబాబు మోడీపై ఈ రేంజ్ ఫైర్ కావటం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. 

ముప్పై ఏళ్ల నాడు ఎన్టీఆర్ కేంద్రంలోని కాంగ్రెస్‌పై తిరుగుబావుట ఎగుర వేశారు. అదే రేంజ్ లో ఇప్పుడు సీన్ రిపీట్ అవుతోంది. చంద్రబాబు మాహానాడు వేదిక నుంచి మోడీతో ఇక రణమే అని ప్రకటించారు. ఆనాటి పరిస్థితులను బట్టి ఎన్టీ రామారావు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురాగలిగారు. అప్పట్లో బలమైన నాయకురాలైన ఇందిరా గాంధీని సైతం ఆయన ఎదిరించారంటే ఆషామాషీ విషయం కాదు. ఎన్టీఆర్  ధైర్యానికి శిరస్సు వంచి నమస్కరించిన వారు ఎందరో. ఆనాడు ఇందిరా గాంధీ ఎంత పవర్ ఫుల్ నేతగా ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. అదే స్థాయి నేతగా ఇప్పుడు మోడీ వెలుగుతున్నారు. అలాంటి నాయకుడిపై చంద్రబాబు తిరుగుబావుట ఎగురవేశారు. దేశంలోని పార్టీలన్నింటినీ ఏకం చేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 2019లో ప్రాంతీయ పార్టీల సత్తా చూపాలని కంకణబద్ధులయ్యారు. 

అందులో భాగంగానే భవిష్యత్ లో ప్రాంతీయ పార్టీలదే హవా అని మహానాడు వేదికగా ప్రకటించారు. కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. దేశంలో ఆనాటి పరిస్థితులే నేడు ఉన్నాయి. కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు ఆనాడు ఎన్టీఆర్ తో బీజేపీ కూడా చేయి కలిపితే... ఈనాడు బీజేపీపై యుద్దానికి  చంద్రబాబు అన్ని పార్టీలను ఏకం చేయాటానికి సమాయత్తం అయ్యారు.  ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారు. అందుకోసం కాంగ్రెస్ కు సైతం దగ్గరవుతున్నారు. మోదీ చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పాలని దేశం లోని పార్టీలన్నింటినీ కోరానున్నారు. తాను ఎవరికి భయపడనని, మోడీ విషయంలో రాజీ లేదంటున్నారు. దేశం మొత్తం మోడీపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని గుర్తు చేస్తున్నారు చంద్రబాబు. 

మోడీపై యుద్ధానికి మహానాడులో తీర్మానం చేశారు. నిధులు ఇవ్వకపోతే తాము పన్నులెందుకు కట్టాలని చంద్రబాబు నిలదీస్తున్నారంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. మరోవైపు... మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవాలనేదే మహానాడులో ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంలో ప్రధానమైంది. 

లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన లేకుండా బ్రహ్మాండంగా విజయం సాధించామని చంద్రబాబు గుర్తు చేయటంలో తాము ఏ పార్టీ పొత్తుకోసం ప్రయత్నం చేయబోమని అంతరార్థం. జాతీయ రాజకీయాల్లో టీడీపీ చురుకైన పాత్ర పోషించాలనేది మరో తీర్మానం.  మహానాడు వేదికగా టీడీపీ అమిత్ షా, మోడీపై ఘటైన వ్యాఖ్యలే చేసింది. ముస్సోలిని, హిట్లర్ తో మోడీ,షాను పోల్చారు టీడీపీ నేతలు.  2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని గుర్తు చేశారు. మోడీ-షాల నిరంకుశ పాలనతో దేశం విసిగిపోయిందని సంకేతాలు పంపింది. 

యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాదిలోపే గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయం వేదికపై గుర్తు చేశారు.  కర్నాటక ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న యడ్డీని సీఎంగా ప్రకటించడం.. మైనింగ్ మాఫియాను అభ్యర్ధులను నిలబెట్టి బీజేపీ నైతిక  విలువలకు తిలోదకాలిచ్చిందని చెప్పారు. కర్నాటక ఎన్నికలు 2018లో బీజేపీని ఓడించేందుకు.. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి నాందీ పలికాయి. కర్నాటక సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కావడానికి దేశంలో రాజకీయ పునరేకీకరణకు తార్కాణం.