వైసీపీలోకి టీడీపీలో ఎమ్మెల్యేల జంపింగ్ ? నిజమేనా ? 

వైసీపీలోకి టీడీపీలో ఎమ్మెల్యేల జంపింగ్ ? నిజమేనా ? 

మరికొందరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతున్నారా? అలాంటిదేమీ లేదంటున్నా ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఎమ్మెల్యేలపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? కేవలం మైండ్‌ గేమ్‌ అనే మాటల్లో నిజం ఎంత?  టీడీపీలో ఎమ్మెల్యేలు పార్టీ వీడుతారనే ప్రచారం ఇప్పటిది కాదు. ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షంలో కూర్చున్న మూడో నెల నుంచీ మొదలైంది. ఇది కేవలం ప్రచారమే అని టిడిపి నేతలు చెపుతూ వచ్చినా....గెలిచిన 23 లో ముగ్గురు పార్టీ మారారు. నేరుగా అధికార పార్టీ జెండా కప్పుకోకపోయినా సిఎంను కలిసి మద్దతు ప్రకటించారు.

గన్నవరం ఎమ్మెల్యే వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం పార్టీకి రాంరాం చెప్పేశారు. దీంతో ఎప్పటికప్పుడు నేతల్ని సంప్రదిస్తూ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తోంది టిడిపి. అయినప్పటికీ కొందరు ఎమ్మెల్యేపార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. మహానాడుకు మూడు రోజుల ముందు నుంచి ఇది మరింత పెరిగింది. కానీ అలా జరగలేదు. తాము ఎక్కడికీ వెళ్లబోమంటూ ఏలూరు సాంబశివారావు, అనగాని సత్య ప్రసాద్ చెప్పేశారు. తాను మంత్రితో బేటీ అయినట్లు నిరూపిస్తే రాకీయాలనుంచి తప్పుకుంటా అంటూ రేపల్లె ఎమ్మెల్యే సవాల్ కూడా చేశారు. దీంతో మహానాడుకు ముందు జరిగింది కేవలం ప్రచారమేనని చెబుతోంది టీడీపీ.

మరోవైపు తాజా లెక్క చూస్తే ఇప్పుడు 20 మంది టిడిపితో ఉండగా మరో ముగ్గురు పార్టీ నుంచి వెళితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుంది అనేది ప్రత్యర్థుల లెక్కని అందుకోసమే చేర్చుకుంటున్నారని TDP నేతలు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే కేవలం నియోజవర్గ అవసరాలకో.. ఇతర విషయాల్లో ప్రభుత్వ సహకారం ఉంటుందన్న కారణంతో మాత్రమే చేరికలుంటున్నాయన్న ప్రచారం సాగుతోంది. అంతేకానీ తాయిలాలు ఎర చూపే సంస్కృతిని జగన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెళ్లినవారికి కూడా ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం వల్ల అది గమనించి పార్టీ మారే విషయంలో మరికొందరు ఆలోచనలో పడ్డారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. 

ఇటు పార్టీ మారే ఎమ్మెల్యేలకు పార్టీ జెండా కప్పే విషయంలో కూడా అధికార పార్టీ భిన్నంగా వ్యవహరిస్తోంది. అలాంటిది ఇక ప్రభుత్వంలో పదవులు, ఇతర పనుల విషయంలో ఎమ్మెల్యేలు ఎక్కువ ఆశించినా ఉపయోగం ఉండదనే వాదనా ఉంది. ఏది ఏమైనా ఉన్నవారిని కాపాడుకునేందుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటాన్ని దెబ్బ తీయాలని వైసిపి మైండ్ గేమ్ అడుతుందని టిడిపి నేతలు చెపుతున్నారు. నిత్యం ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు అనే ప్రచారం వెనుక కారణం అదే అన్నది వారి వాదన. అయితే పరిణామాలు, ప్రరిస్థితులు చూస్తే మాత్రం...నేడు కాకపోతే రేపు అయినా నేతలు గోడ దూకడం ఖాయం అన్న అభిప్రాయం కలుగుతోందని కొందరు చెప్పుకుంటున్నారు. మొత్తానికి నేడు కాకపోతే మరో రోజు టిడిపి పెద్దలకు షాక్ తప్పదన్నది తెరవెనుక టాక్‌.