ముందే సమాచారం ఇచ్చాం...

ముందే సమాచారం ఇచ్చాం...

విజయవాడ బెంజిసర్కిల్ లోని జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వేంకటరత్నం విగ్రహం తొలగింపు వివాదంపై టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు స్పందించారు. కాకాని అంటే మాకు ఎనలేని గౌరవముందని.. వైకాపా నేతలు కావాలనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని తెలిపారు. కాకాని విగ్రహాన్ని ఫ్లై ఓవర్ పనుల పూర్తి అయిన వెంటనే ఎక్కడ ఉందో అక్కడే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

కాకాని వెంకటరత్నం విగ్రహం తొలగింపు విషయమై తాము నెల క్రితమే కాకాని మనవడు విజయ్ కుమార్, మాజీ పార్లమెంటు సభ్యులు చెన్నుపాటి విద్యకు చెప్పామని ఆయన అన్నారు. విగ్రహాన్ని తొలగించి ఫ్లైఓవర్ పనులు పూర్తి అయిన వెంటనే ఎక్కడ ఉందో అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పామని... అప్పుడు చెన్నుపాటి విద్య విగ్రహ కమిటీకి ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. ముందు వారి కుటుంబ సభ్యలకు సమాచారం ఇచ్చిన తర్వాతనే తాము అధికారులతో విగ్రహాన్ని తొలగించే ప్రక్రయను చేపట్టామని అన్నారు. వైకాపా నేతలు కావాలనే దీన్ని రాజకీయం చేస్తన్నారని... అధికారంలో ఉన్నపుడు ఏమీ చేయకుండా ఇపుడు దాన్ని అడ్డుకునేలా చేయటం సరికాదని గద్దె రామ్మోహన్ రావు వివరించారు.