కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు కనిపించడం లేదా?

కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు కనిపించడం లేదా?

అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించారు. చేతిలో పవర్‌ లేకపోయేసరికి జనమే గుర్తు లేరు. ఏడాదిగా నోరు విప్పితేనే ఒట్టు అని అంటున్నారు. గెలిపించలేదని జనంపై కోపమో ఏమో కానీ.. పూర్తిగా నల్లపూస అయిపోయారు.

టీడీపీ హయాంలో కర్నూలు జిల్లాకు పదవుల పందేరం!

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా నేతలకు దక్కినన్ని పదవులు  రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కలేదు. 2014 ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన విధంగా 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకుంది. పార్టీని బలోపేతం చేయాలని పదవుల పందారం పెట్టారు. మంత్రి పదవులు, మండలి చైర్మన్, ఎమ్మెల్సీ  పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎన్నో జిల్లా నేతలకు వరించాయి.  ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ పదవులు పందేరం సాగింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో టీడీపీ జిల్లాలో బలపడలేదు. ఒక్కటంటే ఒక్క సీటూ గెలవలేదు. 

వైసీపీ సర్కార్ రావడంతో టీడీపీ నేతలు గప్‌చుప్‌!

రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాలోని టీడీపీ నేతలు ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌ అయ్యారు. ఇద్దరు ముగ్గురు నేతలు ప్రజాసమస్యలు, కార్యకర్తలపై పెడుతున్న కేసులపై  అప్పుడప్పుడూ మాట్లాడుతున్నారు. ఆ మధ్య మహానాడుకు కూడా హాజరు కాలేదు. పార్టీ ఆఫీసువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. 

మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు నల్లపూసయ్యారా?

సాధారణంగా ప్రతిపక్ష పార్టీ  ప్రజా సమస్యలపై గొంతెత్తి పోరాడుతుంది. జిల్లాలో టీడీపీ మనుగడే ప్రశ్నార్థకం కావడంతో ఆ ఊసే లేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్లకు పరిమితం అయ్యారు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు నల్లపూసయ్యారు. పార్టీ పిలుపిస్తున్న నిరసన్లలో పాల్గొనడం లేదు. 

కర్నూలు కోవిడ్‌ ఆస్పత్రి ఘటనపై మాట్లాడని టీడీపీ నేతలు!

కొన్ని సమస్యలపై  మాజీ మంత్రి అఖిలప్రియ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా కర్నూలు స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నా రోగులకు ఆక్సిజన్‌ అందడం లేదనే వివాదం తెరపైకి వచ్చింది.  24 గంటల వ్యవధిలో 19 మంది కరోనాతో చనిపోవడం కలకలం రేపింది. దీనిపై జిల్లా టీడీపీ నేతలు నొరెత్తకపోవడం కేడర్‌ను ఆశ్చర్యపరుస్తోందట. అధికారం పోతే మరీ ఈ స్థాయిలో నిరుత్సాహం చెందడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నేతలు ఇదే విధంగా ఉంటే..  జిల్లాలో జనం టీడీపీని మర్చిపోతారనే కామెంట్స్‌ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.