వల్లభనేని వంశీ సస్పెన్షన్....టీడీపీ కొంప ముంచిందా ?

వల్లభనేని వంశీ సస్పెన్షన్....టీడీపీ కొంప ముంచిందా ?

ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా ? అనేది పూరీ పోకిరి సినిమా కోసం రాసిన డైలాగ్. అయితే కొంచెం అటూ ఇటుగా తెలుగు రాజకీయాలు కూడా అలానే తగలడ్డాయి. ఏ పార్టీ నుంచి గెలిచామన్నది కాదు.. అధికార పార్టీలో ఉన్నామా లేదా అన్నదే ప్రస్తుత రాజకీయాల్లో కీలకం అయిపొయింది. ఎన్నికల సమయంలో ఒక పార్టీ టికెట్ తెచ్చుకోవడం.. గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించడం.. ఇటీవల కాలంలో కామనైపోయింది. పార్టీల అవసరాలు అలాంటివారిని ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుంటే కేసులు, ఇతరత్రా వ్యవహారాలు వీరిని పార్టీ మారేలా చేస్తున్నాయి.

ఫిరాయింపు చట్టంలోని లొసుగుల ఆధారంగా అలా పార్టీ మారిన వారిని అధికార పార్టీలు కాపాడుకుంటూ వస్తున్నాయి. ఏపీలో గత టీడీపీ సర్కారు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ఇలాగే చేర్చుకుని వారిపై అనర్హత వేటు వేయకుండా ఐదేళ్లూ గడిపేసింది. ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. గతంలో తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారో, ఇప్పుడు అదే తరహాలో టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తోంది. అయితే, పార్టీ ఫిరాయించిన మరుక్షణం అనర్హత వేటు వేస్తామని, అందువల్ల పదవులకు రాజీనామా చేసిన తర్వాతే రావాలని నిబంధన విధించడంతో పలువురు ఎమ్మెల్యేలు కిందా మీదా పడుతున్నారు.

ఎన్నికలు ముగిసి ఆరు నెలలు మాత్రమే అయినందున, పదవి వదులుకోవడం వారికి కాస్త కష్టంగానే కనిపిస్తోంది. తొలుత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికార పార్టీ ఆకర్షణలో పడ్డారు. దీనివల్ల ఎమ్మెల్యే పదవికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. అధికార పార్టీలో చేరితేనే అనర్హత వేటు వర్తిస్తుంది. ఇక్కడ వంశీ విషయంలో పార్టీయే ఆయన్ను సస్పెండ్ చేసినందున ఆయన సేఫ్ అయ్యాడు. ఆయనకు ఎలాంటి సమస్యా రాలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినందున ఇక వారికి లోబడి పని చేయాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఇదే పాయింట్ ను ఆధారంగా చేసుకుని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం వంశీ బాటలో పయనించాలని యోచిస్తున్నట్టు సమాచారం. వంశీ విషయంలో టీడీపీ చేసిన పొరపాటుకు ఇప్పుడు చింతిస్తున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే వంశీ వ్యవహారం చూసిన మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా అలా చేస్తే వేటు వేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.