టీసీఎస్‌ సరికొత్త రికార్డు

టీసీఎస్‌ సరికొత్త రికార్డు

దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా గ్రూప్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మరో మైలురాయిని చేరింది. గత నెలలో 100 బిలయన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను దాటిన ఈ సంస్థ.. తాజాగా దేశీయ స్టాక్‌ మార్కెట్ చరిత్రలో రూ. 7లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్‌ను అధిగమించింది. శుక్రవారం ఒక దశలో టీసీఎస్‌ షేరు 1.91 శాతం పెరిగి 3,674 రూపాయలకు ఆల్‌టైమ్‌ హైని టచ్‌ చేసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,03,309 కోట్లకు చేరింది. గత 52 వారాల్లో టీసీఎస్‌ షేరు ఇంత గరిష్ఠ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సంస్థ షేరు విలువ 35శాతం వరకు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6 లక్షల కోట్లు దాటింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తర్వాత ఈ ఘనత సాధించిన కంపెనీ టీసీఎస్సే. మార్కెట్‌క్యాప్‌ పరంగా చూస్తే ప్రస్తుతం టీసీఎస్‌ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ.5.83 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ.5.19 లక్షల కోట్లు), హెచ్‌యూఎల్‌ (రూ.3.42 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.3.30 లక్షల కోట్లు) ఉన్నాయి.