సీఎంకు కోపం వ‌చ్చింది..! ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్‌లు వేయొద్ద‌ని ఆదేశాలు..

సీఎంకు కోపం వ‌చ్చింది..! ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్‌లు వేయొద్ద‌ని ఆదేశాలు..

మీరు ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్నారా? అయితే... త్వ‌ర‌లోనే డ్రెస్ కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.. ఎందుకంటే.. ఇప్ప‌టికే ప్రభుత్వ ఉద్యోగులు వేసుకునే బ‌ట్ట‌ల‌పై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్‌లు ధరించవద్దని ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.. విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్‌లు ధరించడం హుందాతనం కాదని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది ప్ర‌భుత్వం. ఇది గ్వాలియర్‌ డివిజన్‌లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయి.

దీనికి పెద్ద కార‌ణ‌మే ఉంది.. జులై 20న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జ‌రిగింది.. ఈ స‌మావేశానికి మాండ్‌సౌర్‌ జిల్లాలోని ఓ అధికారి టీ షర్టు ధరించి హాజ‌ర‌య్యారు.. ఆ అధికారి టీష‌ర్టు ధ‌రించ‌డంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాస్త ఇప్పుడు అంద‌రు ఉద్యోగుల మెడ‌కు చుట్టుకున్న‌ట్టు అయ్యింది.. అన్ని జిల్లాల్లోని అధికారులు, ఉద్యోగులు మంచి మరియు అందమైన బట్టలు ధరించి విధుల‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కాగా.. గతంలో అనేక రాష్ట్రాలు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశాయి, టీ-షర్టులు, జీన్స్‌లపై నిషేధం విధించాయి.. గత సంవత్సరం, బీహార్ ప్రభుత్వం కూడా రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగుల కోసం ఇదే విధమైన ఉత్తర్వులను జారీ చేసింది.