పాలు డెలివరి చేయనున్న స్విగ్గీ

పాలు డెలివరి చేయనున్న స్విగ్గీ

సిటీలతో పాటు ఇపుడు మధ్య తరహా పట్టణాల్లోకి స్విగ్గీ వచ్చేసింది. భోజన పదార్థాలను సరఫరా చేసే స్విగ్గీ.. తాజాగా పాలను కూడా డెలివరీ చేయాలని నిర్ణయించింది. స్విగ్గీతో పాటు కాయగూరలు సరఫరా చేసే బిగ్‌ బాస్కెట్‌ కూడా పాల డెలివరీకి రెడీ అవుతోంది. ఈ రంగంలో వెంటనే దూసుకుపోవడానికి వీలుగా.. ఇప్పటికే పాల డెలివరీ చేస్తున్న చిన్న చిన్న కంపెనీల టేకోవర్‌కు ఈ కంపెనీలు రెడీ అవుతున్నాయి. నిధులు పుష్కలంగా ఉన్న స్విగ్గీ.. సూపర్‌ డైలీ అనే స్టార్టప్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇక అలీబాబా కంపెనీ పెట్టుబడి పెట్టిన బిగ్‌ బాస్కెట్‌ కంపెనీ పుణెకు చెందిన రెయిన్‌ క్యాన్‌, గుర్గావ్‌కు చెందిన మిల్క్ బ్యాస్కట్‌ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దక్షిణాదిలో బెంగళూరుకు చెందిన డైలీ నింజా కంపెనీని టేకోవర్‌ చేసుకునేందుకు బిగ్‌బాస్కెట్‌ రెడీ అవుతోంది. 

సగటున నెలకు భారతీయులు కనీసం రూ.1000లను పాలు, డైరీ ఉత్పత్తులపై ఖర్చు చేస్తున్నట్లు వివిధ సర్వేల్లో తేలింది. భోజన, కాయగూరలు డెలివరి వ్యాపారంలో ఉన్న కంపెనీలకు.. ఈ మార్కెట్‌ హాట్‌కేక్‌లా కన్పిస్తోంది. అయితే ఈ వ్యాపారంలో మార్జిన్లు తక్కువగా ఉండటంతో ఇతర కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. అయితే మిగులు నిధులు సమృద్ధిగా ఉన్న ఈ కంపెనీలకు ఈ మాత్ర మార్జిన్‌ సరిపోతుందని కార్పొరేట్‌ వర్గాల అంచనా. బిగ్‌ బాస్కెట్‌ ప్రస్తుతం రోజు 60వేల నుంచి 70 వేల డెలివరీలను చేస్తోంది. ఇక స్విగ్గీ ఏకంగా మూడు లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Photo: FileShot