12ఏళ్ళకు గాడిలో పడుతోన్న ఎస్వీబీసీ !

12ఏళ్ళకు గాడిలో పడుతోన్న ఎస్వీబీసీ !

ధార్మిక ప్రచారం కోసం ప్రారంభించిన టిటిడి ఛానల్ ఇప్పుడు దారిలో పడుతోంది. 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న అస్థవ్యస్థ పరిపాలనను గాడిలో పెడుతున్నారు. కార్యక్రమాలు మొదలుకుని పరిపాలన వరకు ఛానల్ ను కొత్త పుంతలు తొక్కించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రచారం కోసం 2008లో యస్వీబిసి ఛానల్ ని ప్రారంభించింది. అప్పటి రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ చేతులు మీదుగా ఛానల్ ని అట్టహాసంగా ప్రారంభించారు.

శ్రీవారి ఆలయంలో కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలను భక్తుల ముందుంచడమే లక్ష్యంగా ఛానల్ ని ప్రారంభించింది టిటిడి. ఇక ఛానల్ పరిపాలనా వ్యవహారాలను చూసుకోవడానికి ప్రత్యేకంగా బోర్డ్ ని, చైర్మన్ ని కూడా నియమించింది టిటిడి. ఇలా గొప్పగా ప్రారంభించిన ఛానల్ అనతికాలంలోనే వివాదాలుకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. టిటిడికి లేనిపోని తలనోప్పులు తెచ్చిపెట్టడానికి ఛానల్ ఒక వేదికగా తయారైంది.

కొనుగోలు మొదలు కార్యక్రమాల నిర్వహణ వరకు అవినీతి ఆరోపణలు రావడం ఇక గత చైర్మన్ పృధ్వి రాజ్ వ్యవహారంతో ఛానల్ ప్రతిష్ఠే కాకుండా టిటిడి పరువు కూడా బజారున పడే స్థితికి చేరుకుంది. దీంతో  తేరుకున్న ప్రభుత్వం పృధ్విరాజ్ ను ఆగమేఘాలు మీద సాగనంపింది. అటు తరువాత ఛానల్ ప్రతిష్ఠతో పాటు టిటిడి పరువును కాపాడవలసి వుండడంతో ఆ బాధ్యతలను టిటిడి అదనపు ఇఓ దర్మారెడ్డి కి అప్పగించారు టిటిడి పాలకమండలి చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి.

ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఛానల్  ప్రక్షాళన ప్రారంభించారు. అన్ని విభాగాల ఉద్యోగులుతో సమావేశం నిర్వహించి అప్పటి వరకు కొనసాగుతున్న గ్రూప్ రాజకీయాలుకు చెక్ పెట్టారు. ప్రత్యక్షంగా పర్యవేక్షణ ప్రారంభించడంతో చానల్ లో మార్పులు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో ప్రైవేట్ ఆడిట్ సంస్థతో పరిశీలన జరిపించి అనసరం లేని 50 మంది సిబ్బందిని సాగనంపారు.

ఇక తిరుమలలో ప్రతి నిత్యం నాదనీరాజనం మండపంలో ధన్వంతరి మంత్ర పఠనం నిర్వహించడం దానిని యస్వీబిసి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చెయ్యడంతో భక్తులు నుంచి మంచి స్పందన లభించింది. కరోనా సమయంలో లోక సంక్షేమం కోసం 60 రోజులు పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో, అటు తరువాతా సుందరాకాండ పారాయణం ప్రారంభించారు. దీనికీ ఆదరణ లభించడంతో విరాట పర్వం పఠనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూన్నారు.

ఇలా భక్తులు మెచ్చే కార్యక్రమాలు ప్రసారం ద్వారా ధార్మిక ప్రచారం విస్రుత్తంగా చెయ్యాలని భావిస్తున్నారు టీటీడీ పాలకవర్గం. అదే సమయంలో భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తూ వారు సూచించిన మేరకు చానల్ లో యాడ్ ఫ్రీగా మార్చాలని భావిస్తున్నారు. ఛానల్ లక్ష్యం ధార్మిక కార్యక్రమాలను ప్రచారం చెయ్యడమే కావడంతో ఆదాయం వనరుల సమకూర్చడం పై దృష్టి లేకుండా ముందుకు వెళ్తున్నారు.

ఇక ధార్మిక కార్యక్రమాలు రూపొందించే విషయంలో  టిటిడి వేదపాఠశాల, వేదిక్ యూనివర్శిటీలలో వున్న పండితుల సలహాలు సూచనలు స్వీకరిస్తూన్నారు. చరిత్రలో మొదటిసారిగా గ్రహణం సమయంలో శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించిన జప యజ్ఞానికి భక్తులు నుంచి విశేష స్పందన లభించింది. మొత్తంమీద దారి తప్పిన ఛానల్ ను గాడిలో పెడుతూ...నాలుగు నెలలు కాలంలోనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తుండటంపై టీటీడీ పాలకమండలి సంతృప్తి వ్యక్తం చేస్తోంది.