అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా?

అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా?

 కేబినెట్‌లో రెండు బెర్త్‌లు ఖాళీ అవుతున్నాయన్న సమయం నుంచీ పైరవీలు ఓ రేంజ్‌లో సాగాయి. అనేక లెక్కలు, సామాజిక సమీకరణాలు తెరపైకి వచ్చాయి. అధినేత మాట ఇచ్చినందువల్లే గుళ్లూ గోపురాలూ తిరిగారని ప్రచారం జరిగింది. తీరా.. అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటా? లెట్స్‌ వాచ్‌..!

నెల రోజులపాటు కేబినెట్‌ బెర్త్‌లపై విస్తృత చర్చ!

రాజ్యసభ సభ్యులుగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లను ఎంపిక చేసింది మొదలు.. ఏపీ కేబినెట్‌లో ఖాళీ అయ్యే సీట్లపై అనేక ఊహాగానాలు, పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరు బీసీ నేతలే అయినా ఒకరు మత్స్యకార, మరొకరు శెట్టిబలిజ సామాజికవర్గాలకు చెందినవారు. ఇదే సామాజికవర్గాలకు చెందిన వారితోనే తిరిగి స్థానాలు ఫిల్‌ చేస్తారని కొందరు.. బీసీల్లోని ఇతర వర్గాలనూ పరిగణనలోకి తీసుకుంటారని ఇంకొందరు లెక్కలు వేసుకున్నారు. దాదాపుగా నెల రోజుల పాటు వైసీపీ వర్గాల్లో ఇదే చర్చ సాగింది. చివరకు  అవే సామాజికవర్గాలకు చెందిన వారికి కేబినెట్‌లో చోటు కల్పించారు సీఎం జగన్‌. 

సీఎం జగన్‌ ఎంపికలు పార్టీ నేతల అంచనాలకు అందలేదా?
పొన్నాడ సతీష్‌ను కాదని తొలిసారి ఎమ్మెల్యే అప్పలరాజుకు ఛాన్స్‌!

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడం ఒక ఎత్తు అయితే.. R అండ్‌ B మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్‌ను ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించి రెవెన్యూశాఖ కట్టబెట్టడం పార్టీ నేతల అంచనాలకు కూడా అందలేదని టాక్‌. వాస్తవానికి బీసీ కార్డుపై కేబినెట్‌లో చేరాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆశించారు. ఆయన  మంత్రి అయితే అసెంబ్లీలో విపక్షాన్ని ఓ ఆట ఆడుకుంటారని ప్రచారం జరిగింది. తన మనసులో మాట సీఎం జగన్‌కు ఆయన చెప్పినట్లు.. అధినేత ఓకే అనేసినట్లు పార్టీ నేతలు భావించారు. ఇదే సమయంలో సభాపతి సీతారాం అనేక గుళ్లూ గోపురాలు తిరిగి మొక్కులు తీర్చేసుకున్నారు. దీంతో అధినేత మాట ఇవ్వడం వల్లే ఆలయాలు చుట్టేస్తున్నారని అనుకున్నారంతా. కానీ.. శ్రీకాకుళం జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అప్పలరాజుకు అవకాశం ఇవ్వడం సిక్కోలు అధికార పార్టీ నేతల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. మోపిదేవి స్థానంలో మత్స్యకార సామాజికవర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ను తీసుకుంటారని అనుకున్నా.. అదృష్టం అప్పలరాజును వరించింది. 
.
వేణుగోపాల్‌ను తీసుకోవడం వల్లే పొన్నాడకు బెర్త్‌ దక్కలేదా?
తమ్ముడు చేసిన శాఖలనే ఇప్పుడు అన్నకు దక్కాయా?

అప్పలరాజు వృత్తి రీత్యా డాక్టర్‌ కావడం.. దూకుడు.. ప్రతిపక్షంపై గట్టిగా విరుచుకుపడే స్వభావం కలిసి వచ్చిందని అనుకుంటున్నారు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వేణుగోపాల్‌ను మంత్రిని చేయడంతో అదే జిల్లాకు చెందిన పొన్నాడ సీనియర్‌ అయినా బెర్త్‌ దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లాకే చెందిన ధర్మాన కృష్ణదాస్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌నే నమ్ముకుని ఉండటం ఆయనకు ప్లస్‌ అయ్యిందని అంటున్నారు. మొన్నటి వరకూ R అండ్‌ B శాఖ చూసిన కృష్ణదాస్‌ ఇకపై రెవిన్యూశాఖ బాధ్యతలు చేపడతారు. అయితే ఇక్కడ ఇంకో చర్చ జరగుతోంది. కృష్ణదాస్‌ తమ్ముడు ధర్మాన ప్రసాదరావు గతంలో మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఆర్‌ అండ్‌ బీ, రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అన్నకు కూడా అవే శాఖలు దక్కాయి. 

సిక్కోలులో స్పీకర్‌, డిప్యూటీ సీఎం, మంత్రి!

ప్రస్తుతం సిక్కోలు జిల్లాకు మూడు కీలక పదవులు వచ్చాయి. స్పీకర్‌, ఉపముఖ్యమంత్రి, మంత్రి. ఇంత వరకూ బాగానే ఉన్నా.. పార్టీలో సీనియర్లుగా ఉన్న తమను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదా అని కొందరు నేతలు మదనపడుతున్నారట. తొమ్మిదేళ్లుగా పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నా ఛాన్స్‌ రావడం లేదు. అనుకున్నదొక్కటీ.. అవుతున్నదొక్కటీ  అని చిటపటలాడుతున్నారట.