ఇల్లు కొన్నవారికి షేర్లు ఫ్రీ

ఇల్లు కొన్నవారికి షేర్లు ఫ్రీ

తమ కంపెనీలో ఇల్లు కొనుగోలు చేసినవారికి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన 2000 షేర్లను ఉచితంగా ఇస్తామని జేపీ గ్రూప్‌ ప్రకటించింది. తర్వాత పలు కారణాలతో చితికిపోయి దివాలా తీసిన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను పునరుజ్జీవింపజేసేందుకు జేపీ గ్రూప్‌ పదివేల కోట్ల రూపాయల ప్రణాళికను వెల్లడించింది. ఈ ప్రణాళికలో భాగంగా ఇల్లు బదులుగా షేర్లు ఇచ్చే విషయాన్ని తెరపైకి తెచ్చింది. జేపీ అసోసియేట్స్‌కు అనుబంధ సంస్థ అయిన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ 2007లో నోయిడాలో 32వేల ఫ్లాట్స్‌ అభివృద్ధి చేయడం స్టార్ట్ చేసింది. ఇందులో 9,500 ఫ్లాట్స్‌ను డెలివరీ చేసింది. మరో 4,500 ఫ్లాట్లకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను అందించేందుకు దరఖాస్తు కూడా చేసుకుంది. 2021 నాటికి మిగిలిన ఫ్లాట్లను డెలివరీ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. కానీ రుణభారం పెరిగిపోవడంతో పనులు పూర్తికాలేదు. దీంతో టైమ్ కు డెలివరీ జరగని వాళ్లంతా కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంకు జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ నుంచి తమ రుణాలు రాబట్టుకునే యత్నాలు ఆరంభించడంతో ఇళ్లు కొన్నవారిలో ఆందోళన మరింత పెరిగింది.

దీంతో ఇళ్లు కొన్నవారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు షేర్లు ఇచ్చే ప్రతిపాదనను జేపీ గ్రూప్‌ తెచ్చింది. ఇందుకోసం 4.5 కోట్ల షేర్లు అవసరమని అంచనా వేసింది. కేవలం షేర్లు ఇవ్వడమే కాకుండా ఇళ్ల కొనుగోలుదారులకు రెరా ప్రకారం జరిమానా కూడా చెల్లిస్తామని, ఫస్ట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో 50 శాతం స్టాంప్‌ డ్యూటీ భరిస్తామని జేపీ గ్రూప్‌ వెల్లడించింది. అంతేకాకుండా జరిమానా చెల్లించేందుకు హామీగా జేపీ అసోసియేట్స్‌ రూ. 750 కోట్లను సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్‌ కూడా చేసింది.