పూరి రధ యాత్రకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

పూరి రధ యాత్రకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

పూరి జగన్నాధ్ రధ యాత్రకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. భక్తులు పాల్గొనకుండా రధయాత్రకు అనుమతి ఇచ్చింది కోర్టు. కరోనా కట్టడికి నిబంధనల అమలులో రాజీ లేకుండా, ఒడిస్సా, కేంద్రం సమన్వయంతో రధయాత్ర నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

క‌రోనా వైర‌స్‌ మహమ్మారి కారణంగా ఒడిశాలోని పూరీలో ఈ నెల 23న జ‌ర‌గాల్సిన జగన్నాథుని రథయాత్రకు అనుమతిస్తే, జగన్నాథుడు మనల్ని క్షమించడని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజనాలు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రథయాత్రను అనుమతించలేమని తెలిపింది. రథయాత్రను నిలిపివేయాలని ఈ నెల 18న ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని, సవరించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  

కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇది దశాబ్దాల సంప్రదాయం అని, ప్రజలు లేకుండా రథయాత్రకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇది కోట్లాది మంది విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం అని గుర్తు చేసిన ఆయన సంప్రదాయం ప్రకారం రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు బయటకు రాకుంటే పన్నెండేళ్ల వరకు మళ్లీ బయటకు రాలేరని వివరించారు. ప్రజలు పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించవచ్చని ఆయన తెలిపారు. ఒడిశా ప్రభుత్వం కూడా కేంద్రం వాదనకు మద్దతిచ్చింది. దీంతో పూరీ జగన్నాథుని రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతించింది. భక్తులు లేకుండా జగన్నాథుని రథయాత్ర జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.