సన్‌ రైజ్‌..

సన్‌ రైజ్‌..

హోంగ్రౌండ్‌పై సన్‌రైజర్స్‌ చెలరేగారు. టోర్నీలో ఏడో గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లోకి వచ్చారు. డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొంది సత్తాచాటారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు  చేసింది. పృథ్వీ షా (36 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయ్యర్‌ (36 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ముఖ్యంగా షా.. కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోర్‌ బోర్డును పరిగెత్తించాడు. సిద్ధార్థ్, భువనేశ్వర్‌, రషీద్‌ఖాన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. టోర్నీలో విశేషంగా రాణిస్తున్న పంత్‌ (19 బంతుల్లో 18; 1 ఫోర్‌) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరాడు. చివర్లో విజయ్‌ శంకర్‌ (13 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝళిపించడంతో ఢిల్లీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. 164 పరుగలు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ జట్టులో ఓపెనర్లు హేల్స్‌(45), ధావన్‌(33) శుభారంభం అందించారు.

10 పరుగుల తేడాలో హేల్స్‌, ధావన్‌ ఇద్దరూ అవుటవడంతో సన్‌రైజర్స్‌ జోరు తగ్గింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండే(21) భారీషాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. సన్‌రైజర్స్‌ విజయానికి 17 బంతుల్లో 32 పరుగులు అవసరమైన స్థితిలో క్రీజులోకి వచ్చిన  పఠాన్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిశ్రాకు 2 వికెట్లు తీశాడు.