మరోసారి మ్యాజిక్ చేసిన హైదరాబాద్

మరోసారి మ్యాజిక్ చేసిన హైదరాబాద్

తక్కువ పరుగులు చేసినా ఎలా గెలవాలో హైదరాబాద్ జట్టును చూస్తే తెలిసిపోతుంది... 150 పరుగల కంటే తక్కువ స్కోర్ చేసి బౌలింగ్ మాయాజాలంతో మరో విక్టరీని కొట్టింది సర్ రైజర్స్ హైదరాబాద్. సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో బెంగళూరును కట్టడి చేసింది. భువనేశ్వర్, సిద్ధార్థకౌర్ తమ బౌలింగ్‌తో చెలరేగిపోవడంతో బెంగళూరుకు మరో ఓటమి తప్పలేదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్... 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లతో పాటు మనీష్ పాండే త్వరగానే ఔట్ కావడంతో 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విలియమ్‌సన్స్, షకీబ్ కలిసి ఇన్సింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసినా బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో స్కోర్ బోర్డు పెద్దగా పరుగులు పెట్టలేదు. 

35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విలియమ్ సన్స్ ఆ తర్వాత కొద్దిసేపటికే ఔట్ అయ్యాడు. తర్వాతి బ్యాట్స్‌మన్లు విఫలం కావడంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేయలేకపోయారు. 22 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు పడ్డాయి. 147 పరుగుల స్వల్ప పరుగల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బెంగళూరు తడబడుతూనే ఆట మొదలెట్టింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నంతసేపు మ్యాచ్ ఆర్‌సీబీ వైపే సాగింది. కోహ్లీకి అండగా పార్థీవ్ పటేల్ నిలిచాడు... 39 రన్స్ చేసిన కోహ్లీ ఔట్ అయ్యాక... డివిలియర్స్ 5 పరుగులకే వెనుతిరిగాడు... చివర్లో మన్‌దీప్ సింగ్ కష్టపడినా హైదరాబాద్ బౌలింగ్ మాయకు పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో సన్ రైజర్స్ 5 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన హైదరాబాద్ కెప్టెన్ విలియమ్ సన్... మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో ఐదు హాఫ్ సెంచరీలో బాది... టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆడిన 10 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ఆర్సీబీకి  ప్లేఆఫ్ ఆశలు దాదాపు దూరమైనట్టే... ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ... కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది.