ప్లేఆఫ్‌కు సన్‌రైజర్స్‌

ప్లేఆఫ్‌కు సన్‌రైజర్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 9 వికెట్ల తేడాతో  గెలుపొంది  ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా సన్‌రైజర్స్‌ నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  ఓపెనర్ శిఖర్ ధావన్ (92 నాటౌట్: 50 బంతుల్లో 9x4, 4x6), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (83 నాటౌట్: 53 బంతుల్లో 8x4, 2x6) రాణించడంతో  హైదరాబాద్ జట్టు 9 వికెట్ల తేడాతో  విజయాన్ని అందుకుంది. ఛేదన ఆరంభంలోనే హైదరాబాద్ జట్టు ఓపెనర్ అలెక్స్ హేల్స్ (14) వికెట్‌ని చేజార్చుకున్నా.. ధావన్..విలియమ్సన్ జోడి రెండో వికెట్‌కి 102 బంతుల్లో 176 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి విజయాన్ని అందించారు. అంతకముందు హార్డ్‌ హిట్టర్ రిషబ్ పంత్ (128 నాటౌట్: 63 బంతుల్లో 15x4, 7x6)  చెలరేగి శతకం బాదడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ విజయంతో  హైదరాబాద్ జట్టు మరో మూడు మ్యాచ్‌లు ఉండగానే ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకోగా.. మొత్తంగా ఎనిమిదో ఓటమితో ఢిల్లీ ప్లేఆఫ్ ఆశల్ని వదులుకుంది.