సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ విజయం

సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ విజయం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా జైపూర్‌ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ అజింక్యా రహానే 53 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 65 పరుగులు చేసినప్పటికీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. సంజు శాంసన్ 30 బంతుల్లో 40 పరుగులు చేశాడు. బోన్ స్టోక్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు. జోస్ బట్లర్ (10), మహిపాల్ (11), గౌతమ్ (8) తడబడడంతో ఓటమి పాలైంది.  

హైదరాబాద్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ 2, సందీప్ శర్మ, బాసిల్ థంపి, రషీద్ ఖాన్, యూసుఫ్ పఠాన్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన హైదరాబాద్  17 పరుగులకే శిఖర్ ధవన్(6) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్  43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, గౌతమ్ 2,  ఉనద్కత్, సోధి చెరో వికెట్ తీసుకున్నారు.