రివర్స్ టెండర్ల ద్వారా డబ్బు ఆదా అవుతుందన్న గ్యారెంటీ ఏంటి ?

రివర్స్ టెండర్ల ద్వారా డబ్బు ఆదా అవుతుందన్న గ్యారెంటీ ఏంటి ?

ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల పై తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం మీద ఎంపీ సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రివర్స్ టెండరింగ్ మీద పీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనాచౌదరి డిమాండ్ చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన సుజనా ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా రివర్స్ టెండర్ల ప్రక్రియను చేపట్టిందని, రివర్స్ టెండర్లలో సీవీసీ విధానం పాటించారా? అని ప్రశ్నించారు. రివర్స్ టెండర్ల వల్ల  ఆదా అయ్యింది ఏమీ లేదని, రివర్స్ టెండర్ల ద్వారా డబ్బు ఆదా అవుతుందన్న గ్యారెంటీ ఏంటి అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నామమాత్రంగా రివర్స్ టెండరింగ్ నిర్వహించారని చెప్పారు.

పోలవరంలో 67 శాతం పనులు పూర్తిచేశామని గత ప్రభుత్వం చెప్పిందని, అసలు ఎంతవరకు పనులు అయ్యాయి అన్న విషయం మీద శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా కోరారు. ఏపీలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని సుజనా చౌదరి వాపోయారు. బ్యాంకులు ఇప్పటికే ఆర్థికసాయం నిలిపేశాయని చెప్పారు. ఏపీకి  పారిశ్రామికవేత్తలు రావడం లేదని అన్నారు. ఇసుక పాలసీపైనా స్పష్టత లేదని అన్నారు. పోలవరం నాణ్యతను తగ్గించి ధరలు తగ్గించారా? లేక ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పుడు ధరలను తగ్గించి ప్రాజెక్టును ఆలస్యం చేస్తారా ? అనే విషయాన్ని ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను వైసీపీ ప్రభుత్వం చేస్తోందని సుజనా చౌదరి అన్నారు.