క్షేత్రం వద్దకే న్యాయస్థానం

క్షేత్రం వద్దకే న్యాయస్థానం

జడ్జిలంటే కోర్టుల్లో కూర్చొని తీర్పులు చెప్పడం మాత్రమే చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ కేరళలోని ఎర్నాకులంలో సబ్ జడ్జిగా పనిచేసే ఏ.ఎం. బషీర్ రూటే సెపరేటు. పట్టణంలోని పబ్లిక్ మార్కెట్ లో గుట్టలుగా పేరుకు పోయిన చెత్త నుంచి ముక్కులు బద్దలయ్యే దుర్వాసన వస్తోందని ఎన్ని ఫిర్యాదులు చేసినా స్థానిక కార్పొరేషన్లో కదలిక రాలేదు. దీంతో జడ్జిగారు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. స్వయంగా మార్కెట్ కి వచ్చి అక్కడి చెత్త తరలించే వరకు కదలకుండా కూర్చొన్నారు.

ఎర్నాకులం పబ్లిక్ మార్కెట్ లో భారీగా చెత్త పోగయింది. తొలగించాల్సిన పురపాలక సిబ్బంది అటు వైపు కనీసం తొంగి చూడకపోవడంతో నానావ్యర్థాలతో అక్కడో చిన్నసైజు చెత్త గుట్ట తయారైంది. అందులోనూ వర్షాలు ప్రారంభం కావడంతో స్థానికులు అనారోగ్యం పాలయ్యారు. ఎన్నిసార్లు వినతులిచ్చినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కొందరు కోర్టులో ఫిర్యాదు చేశారు. 

దీనిపై స్పందించిన జడ్జి ఏఎం బషీర్ కోర్టు గోడలు దాటి మార్కెట్ లో విచారణ చేపట్టారు. ఆ చెత్తనంతా తొలగించే వరకు తాను అక్కడి నుంచి కదిలేది లేదని కుర్చీ వేసుకొని కూర్చొన్నారు. దీంతో కొచ్చిన్ కార్పొరేషన్ సిబ్బందిలో ఆందోళన చెందారు. లారీలు, జేసీబీలతో హుటాహుటిన శానిటేషన్ బృందం తరలి వచ్చింది. దాదాపుగా 15 లోడ్ ల వ్యర్థాలు తరలించాల్సి వచ్చింది. సాయంత్రానికల్లా ఆ ప్రాంతం శుభ్రపడింది.