నష్టాలతో మొదలైన మార్కెట్లు

నష్టాలతో మొదలైన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతుండటంతో.. మన మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి 50 పాయింట్ల నష్టంతో 10718 వద్ద ట్రేడవుతోంది. ఫార్మా, ఐటీ మినహా మిగిలిన రంగాల సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ స్వల్ప లాభంతో క్లోజ్‌ కాగా, నాస్‌డాక్‌ 0.70 శాతం నష్టంతో ముగిసింది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌ కూడా నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఐటీ షేర్లు వెలుగులో ఉన్నాయి. గత కొన్ని సెషన్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న టెక్‌ మహీంద్రా ఇవాళ ఒకటిన్నర శాతం లాభపడగా, ఇన్ఫోసిస్‌ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, సిప్లా ఒక శాతం వరకు లాభాలో ట్రేడవుతున్నాయి.

ముడి చమురు ధరల్లో అమెరికా చమురు ధరలకన్నా బ్రెంట్‌ ముడి చమురు ధర పెరుగుతోంది. వీటిమధ్య అంతరం రెండు, మూడు డాలర్లు ఉండేది. ఇపుడు ఏకంగా ఆ వ్యత్యాసం పది డాలర్లకు చేరింది. బ్రెంట్‌ ధర అధికంగా ఉండటంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు బాగా నష్టపోతున్నాయి. అలాగే చమురు ఆధార ఉత్పత్తులను తయారు చేసే ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీల షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. నష్టపోయిన నిఫ్టి షేర్లలో బీపీసీఎల్‌ 2 శాతం నష్టంతో టాప్‌లో ఉంది. పవర్‌ గ్రిడ్‌, హెచ్‌పీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐఓసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.