మార్కెట్‌ శుభారంభం

మార్కెట్‌ శుభారంభం

మన స్టాక్‌ మార్కెట్‌ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిక్కీ మినహా మిగిలిన సూచీలన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా...ఆ ప్రభావం ఆసియాలో కన్పించడం లేదు. దీనికి కారణంగా ముడి చమురు ధరలు భారీగా క్షీణించడమే. తాజా వార్తల ప్రకారం ముడి చమురు ధరలు రెండు శాతం దాకా క్షీణించాయి. దీంతో మన మార్కెట్లలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐఓసీ ఏడు శాతం లాభపడగా హెచ్‌పీసీఎల్‌ కూడా ఆరు శాతంపైగా లాభంతో ట్రేడువుతోంది. ఇక బీపీసీఎల్‌ కూడా నాలుగున్నర శాతం ట్రేడవుతోంది. గెయిల్‌ రెండు శాతందాకా లబ్ది పొందింది. సన్‌ ఫార్మా నాలుగు శాతం లాభపడింది. నిఫ్టి షేర్లలో నష్టపోయిన వాటిల్లో  టెక్‌ మహీంద్రా ఒక శాతం నష్టపోగా ఇతర షేర్లు నామ మాత్రపు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఓపెనింగ్‌లో నిఫ్టి 53 పాయింట్ల లాభంతో 10,658 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఇలోనూ ఇదే ట్రెండ్‌ కన్పిస్తోంది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలదే హవా. ఇక నష్టపోయిన వాటిలో పీసీ జ్యువల్లర్స్‌ 5 శాతంపై నష్టంతో టాప్‌లో ఉంది.