5 నెలల్లో లక్ష కోట్ల నెట్‌వర్త్‌ ఉఫ్‌!

5 నెలల్లో లక్ష కోట్ల నెట్‌వర్త్‌ ఉఫ్‌!

స్టాక్‌ మార్కెట్‌ పతనం ఎఫెక్ట్‌... టాప్‌ కంపెనీలపై తీవ్రంగా చూపింది.  అంబానీ, అదానీలతో పాటు 20 టాప్‌ కంపెనీల నెట్‌వర్త్‌ కేవలం అయిదు నెలల్లో ఏకంగా లక్షా 22 కోట్ల రూపాయలు మేరకు తగ్గిపోయింది. అంబానీ, అదానీలతో పాటు మరో ముగ్గురు కోటీశ్వరులకు చెందిన కంపెనీల మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ లక్ష కోట్ల మేరకు తగ్గింది. ఇదంతా 2018 ఆరంభం నుంచి ఇప్పటి వరకు వేసిన గణాంకాలే. ఈ వివరాలను బ్లూమ్‌బర్గ్‌ బిలియన్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. స్టాక్‌ మార్కెట్‌  పతనం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న గ్రూప్‌ ... అదానీ. ఈ గ్రూప్‌ కంపెనీల నెట్‌వర్త్‌ 6.75 బిలియన్‌ డాలర్ల నుంచి 3.68 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

2014లో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరవాత అత్యధికంగా లబ్ది పొందిన గ్రూప్‌లో ఇదొకటి. అదానీ గ్రూప్‌లోని వివిధ కంపెనీల పతనం 7 శాతం నుంచి 45 శాతం వరకు ఉంది. అదానీల తరవాత బాగా దెబ్బతిన్న కంపెనీ విప్రో. అజీమ్‌ ప్రేమ్‌జీకి చెందిన  ఈ కంపెనీ ఐటీ మార్కెట్‌ స్తబ్దుగా మారిన తరవాత... మళ్ళీ పూర్వ వైభవం కోసం నానా తంటాలు పడుతోంది. కాని సాధ్యంకావడం లేదు. అయిదు నెలల్లో ఈ కంపెనీ షేర్‌ 16 శాతం క్షీణించింది. ఇక తరవాతి స్థానంలో ఉంది సన్‌ ఫార్మాకు చెందిన దిలిప్‌ సాంఘ్వి గ్రూప్‌. ఈయన నెట్‌వర్త్‌ కూడా ఏకంగా 934 కోట్ల డాలర్ల నుంచి 346 కోట్ల డాలర్లకు పైగా పడిపోయింది. అంటే మూడో వంతుకు పడిపోయిందన్నమాట. బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో ముకేష్‌ అంబానీ 21వ స్థానంలో ఉన్నారు. ఈయన నెట్‌వర్త్‌ 283 కోట్ల డాలర్లు తగ్గింది.