స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తుల జప్తు 

స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తుల జప్తు 

బ్యాంకులకు రూ.5,000 కోట్ల మేరకు ఎగనామం పెట్టిన కేసుకు సంబంధించి  గుజరాత్‌ ఫార్మా కంపెనీ 'స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్‌'నకు చెందిన రూ.4,701 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జప్తు చేసింది.  ఇందులో 4,000 ఎకరాల భూమి, ప్లాంట్, యంత్రాలు.. కంపెనీలు, ప్రమోటర్లకు చెందిన సుమారు 200 బ్యాంకు ఖాతాలు, రూ.6.67 కోట్ల విలువైన షేర్లు, ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ సంస్థ, దాని ప్రమోటర్లు నితిన్, చేతన్‌ సందేశారాలపై గత ఏడాది అక్టోబర్‌లో కేసు నమోదు చేసింది. సందేశారా సోదరులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.5,000 కోట్ల రుణాలను పొందినా.. పైసా కూడా చెల్లించలేదు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేయడంతో కంపెనీ ప్రధాన ప్రమోటర్లందరూ పరారీలో ఉన్నారు. దారి మళ్లించిన నిధులతో స్టెర్లింగ్‌ గ్రూప్‌ ప్రమోటర్లు దేశ, విదేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో స్టెర్లింగ్‌ గ్రూప్‌ చేసిన విదేశీ లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభమైంది.