నిలకడగా ప్రారంభమైన నిఫ్టి

నిలకడగా ప్రారంభమైన నిఫ్టి

అమెరికా మార్కెట్లకు నిన్న సెలవు. ఇవాళ ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇటలీ రాజకీయ సంక్షోభంతో పాటు చమురు ధరల్లో హెచ్చు తగ్గుల కారణంగా సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఇవాళ నిలకడగా ప్రారంభమైంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి స్వల్పంగా 8 పాయింట్లు తగ్గి 10980 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అకౌంట్స్‌ శుద్ధి కార్యక్రమం చేపట్టడంతో పాటు వేల మంది కార్మికులకు ఎల్‌ అండ్‌ టీ ఉద్వాసన పలకడంతో ఆ కౌంటర్‌లో కొనుగోళ్ళ మద్దతు అందింది. ఎల్‌ అండ్‌ టీ 3 శాతం పైగా లాభపడగా, గెయిల్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ షేర్లు ఒక శాతం పైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక నష్టాల్లో ఉన్న కౌంటర్లలో వేదాంత ముందుంది. తన స్టెరిలైట్‌ ప్లాంట్‌ను మూసివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఆ షేర్‌ 3 శాతం దాకా క్షీణించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, లుపిన్‌, ఇండియా బుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ షేర్లు 1 నుంచి 2 శాతం వరకు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఇలో యూ ఫ్లెక్స్‌ షేర్‌ 11 శాతం లాభపడింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జస్ట్‌ డయల్‌, క్వాలిటీ, కోక్స్‌ అండ్‌ కింగ్స్‌ షేర్లు నాలుగు శాతం వరకు నష్టాలతో ట్రేడవుతున్నాయి.