మొదలైన మహానాడు హడావిడీ

మొదలైన మహానాడు హడావిడీ

తెలుగుదేశం పార్టీ పండుగ 'మహానాడు'కు తమ్ముళ్లు సిద్ధమయ్యారు... రాజకీయ విధానంతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఏవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో మహానాడులో కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతీ ఏడాది మే నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజులు పాటు జరిగే ఈ వేడుకకు విజయవాడ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో సర్వం సిద్ధమైంది.

వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే చివరి మహానాడు కావడంతో... మహానాడు వేదిక నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది తెలుగుదేశం. ఈ రోజు ఉదయం 8.30 గంటల నుంచి ప్రతినిధుల నమోదు ప్రక్రియ మొదలుకానుంది. ఆ తర్వాత డ్వాక్రా బజార్‌, ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు టీడీపీ శ్రేణులు... మహానాడు ప్రధాన కార్యక్రమం ఉదయం 10.30 గంటలకు ప్రారంభించేలా ప్లాన్ చేశారు. ఇక ఈ సారి మొత్తం 36 తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు తెలుగు తమ్ముళ్లు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు మారడంతో కేంద్రం వైఖరిని ఖండించేందుకే ప్రత్యేకంగా నాలుగు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రానికి చేసిన అన్యాయం, క్షీణిస్తున్న కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న తీరు, పెరుగుతున్న పెత్తనం, రాష్ట్రాల ఆర్థిక పరిపుష్ఠిని దెబ్బతీసేలా 15వ ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం, వంటి అంశాలపై  మహానాడు వేదికగా తీవ్రంగా స్పందించనుంది టీడీపీ. నాలుగు ఉమ్మడి తీర్మానాలతో పాటు,  ఎన్టీఆర్‌కి నివాళి, కేంద్ర రాజకీయాల్లో టీడీపీ రోల్‌పై కీలక ప్రకటన ఉండబోతోంది. ఇక ఏపీకి సంబంధించి 20, తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలు చేయనున్నారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ, పార్టీ పటిష్ట నిర్మాణానికి తీర్మానాలు చేస్తూ, సాధించిన విజయాలను మననం చేసుకుంటూ మూడు రోజులపాటు నిర్వహించుకునే మహానాడు వేడుక విజయవాడలో నిర్వహించడం నాలుగోసారి.

విజయవాడలో ఎటు చూసినా పసుపుపండుగ శోభ కనిపిస్తోంది... టీడీపీ జెండాలు, స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలతో నగరంలోని ప్రధాన రహదారులు పుసుపు వర్ణ శోభితంగా మారాయి. వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల ఎన్టీఆర్‌, చంద్రబాబు కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక మహానాడు చరిత్రలోనే ఈసారి అతి పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. 120 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ప్రధాన వేదిక సిద్ధమైంది. మహానాడుకు రోజుకి సుమారు 36-40 వేల మంది వస్తారని అంచనా వేసిన నేతలు... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మహానాడుకు వచ్చే అతిథులకు పసందైన విందు  ఏర్పాట్లు చేస్తున్నారు. రోజూ సుమారు 25 వేల మందికి ఉదయం టిఫిన్స్‌, 40 వేల మందికి రెండు పూటలా భోజనాలు పెట్టేందుకు సిద్ధమయ్యారు.