అనుచరుల తీరుతో చిక్కుల్లో పడుతున్న ఏపీ మంత్రి !

అనుచరుల తీరుతో చిక్కుల్లో పడుతున్న ఏపీ మంత్రి !

నేటి రాజకీయాల్లో మున్సిపల్‌ కార్పొరేటర్‌ అంటేనే... వెంట భారీగా మందీ మార్బలం ఉంటోంది. అలాంటిది మంత్రి అంటే.. ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్కోసారి అలాంటి ఫాలోవర్స్‌ వల్ల తమకు సంబంధం లేకపోయినా నేతలు చిక్కుల్లో పడతారు. ప్రస్తుతం మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉందట. 
 
ఏడాది క్రితం నకిలీ సిఫారసు లేఖలతో దుమారం!

అనుచరుల అత్యుత్సాహం.. వారి వ్యవహారాలు పదవికే ఎసరు పెట్టేలా ఉన్నాయని అనుకుంటున్నారు. అటు అనుచరులను ఏమీ అనలేక.. ఇటు ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక బాలినేనికి తలబొప్పి కడుతోందని సమాచారం. ఏడాది క్రితం మంత్రి బాలినేని పేరుతో నకిలీ సిఫారసు లేఖలు బయటకు వచ్చాయి. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొంత మంది బాలినేని లేఖ కోసం క్యూ కట్టారు. మంత్రితో సన్నిహితంగా ఉంటోన్న అనుచరులు బాలినేని పేరుతో నకిలీ సిఫారసు లేఖలు తయారు చేశారు. అనుమానం వచ్చి జిల్లా అధికారులు ఆరా తీయడంతో నకిలీల వ్యవహారం బయటపడింది. మంత్రి సైతం అవాక్కయ్యారు. 
 
తమిళనాడులో కారులో సీజ్‌ చేసిన రూ.5 కోట్ల నగదు కేసులో మంత్రి పేరు!

సరిగ్గా ఏడాది తిరగ్గానే బాలినేని పేరు ఏపీతోపాటు తమిళనాడులోనూ చర్చకు దారితీసింది. ఈ నెల 14న కారులో 5 కోట్ల 22 లక్షల నగదు పట్టుకున్న ఘటనలో మంత్రి బాలినేని పేరు  బయటకొచ్చింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కారులో ఉన్నవారు మంత్రి పేరు చెప్పారట. ఈ ఘటన దుమారం రేపడంతో ఆ డబ్బుతో తనకెలాంటి సంబంధం లేదని మీడియా ముందుకొచ్చి మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. విపక్ష పార్టీలకు ఆయన కార్నర్‌ అయ్యారు. 
 
ఏడాదిలో రెండు వివాదాలతో మంత్రికి ఇక్కట్లు!

అయితే కారులో ఉన్న నగదు తనదే అంటూ మంత్రి అనుచరుడు నల్లమల్లి బాలు చెప్పడంతో మరో నాలుగు రోజులపాటు మీడియాలో చర్చ జరిగింది. మంత్రిని రక్షించేందుకే బాలు రంగంలోకి దిగాడనే ప్రచారం జరిగింది. కేబినెట్‌ నుంచి బాలినేనిని తొలగించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది.  ఒకవేళ మంత్రి చెప్పిందే నిజం అనుకుంటే.. అనుచరులే ఆయనకు ఇబ్బందిగా మారారనే టాక్‌ జోరందుకుంది. మంత్రి పదవి చేపట్టి ఏడాది తిరిగే సరికి ఈ విధంగా అనుచరులు తెచ్చి పెట్టిన రెండు వివాదాలు బాలినేనికి తీవ్ర ఇబ్బందిగా మారాయి. 
 
బాలినేని దగ్గర అనుచరులకు చనువు ఎక్కువ!

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం విద్యుత్, అటవీశాఖ మంత్రిగా ఉన్నారు. సీఎం జగన్‌కు దగ్గర బంధువు. YSR హయాంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న బాలినేని జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. YSRతోపాటు జగన్‌ కేబినెట్‌లోనూ మంత్రిగా ఉన్నారు. సాధారణంగా బాలినేనికి అభిమానులు సంఖ్య ఎక్కువ. కొందరు నేతలు ఎంతమంది అభిమానులు ఉన్నా.. వారిని ఎక్కడ ఉంచాలో.. ఎంత వరకు ప్రాధాన్యం ఇవ్వాలో అంతవరకే ఇస్తారు. కానీ బాలినేని దగ్గర అనుచరులు, అభిమానులకు కాస్త చనువు ఎక్కువ. ఆయన కూడా పెద్దగా పట్టించుకోరు. ఈ వైఖరే మంత్రికి సమస్యలు తెచ్చిపెడుతోందని అంటున్నారు. మరి.. రాబోయే రోజుల్లో బాలినేనికి ఆయన అనుచరుల నుండి ఇంకా ఎన్ని గండాలు వస్తాయోనని ఒంగోలులో టాక్ నడుస్తోంది.