కరోనా పోరాటం : శెభాష్ పోలీస్ !

కరోనా పోరాటం : శెభాష్ పోలీస్ !

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది . వైరస్‌ సోకిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో..ఎవరెవరిని కలుస్తున్నారో తెలియక అంతా భయంగా భయంగా గడపాల్సి వస్తుంది. చివరకు సొంత మనుషులపై కూడా నమ్మకం కోల్పోయేలా చేసింది మాయదారి కరోనా వైరస్‌. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లోనూ...ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్న వారిలో...వైద్యుల కంటే ముందు వరుసలో ఉండేది పోలీసులే. కరోనా లక్షణాలు కనిపిస్తేనో కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులకో డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. కానీ..పోలీసులు డ్యూటీ కత్తిమీద సాము లాంటింది. రోడ్డెక్కిన ప్రతీ వ్యక్తినీ తనిఖీ చేయాలి వారితో మాట్లాడాలి.. సమాచారం పూర్తిగా తెలుసుకోవాలి..లాక్‌డౌన్‌ సమయాల్లో రోడ్డుపైకి వచ్చినందుకు వాళ్ల వాహనాలు స్వాధీనం చేసుకోవాలి.వాటిని పోలీస్‌ స్టేషన్‌లకు తరలించాలి.. 

ఎంత సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చేసినా..చెక్‌పాయింట్ల వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులతో వాహనదారులు ఖచ్చితంగా టచ్‌ అవుతుంటారు. మనుషులకు దూరంగా ఉన్నా..కనీసం వారి వాహనాలనైనా తాకక తప్పని పరిస్థితి. దీంతో పోలీసుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరస్‌ బారిన పడకుండా కాపాడు దేవుడా అని మొక్కుకోవడం తప్ప..చేసేదేమీ లేదని పోలీసుల ఫ్యామిలీలు డిసైడ్‌ అయిపోయాయి. వేళకి నిద్ర , భోజనం కరువు..డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేవరకూ అనుమానమే . లాక్‌ డౌన్‌ లో బైటకు వచ్చిన వ్యక్తులపై లాఠీ ఝులిపిస్తే అందరిలోనూ అభాసుపాలయ్యే మొదటి వ్యక్తి కూడా పోలీసే. లాఠీ ఎత్తకుంటే కరోనా అంటేనే భయపడకుండా రోడ్లపైకి వస్తున్న ఈ జనాలకు పోలీసులంటే భయమేమి ఉంటుంది. అడకత్తెరలో పోకచెక్కలా తయారైన పోలీసు ఉద్యోగంతో..కత్తిమీద సాము చేస్తున్నామని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . తామూ మనుషులమేనని...మమ్మల్ని చూస్తే కరోనా వైరస్‌ భయంతో పారిపోతుందా అని వెటకారంగా..ఆవేదనతో ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్న సిబ్బందీ లేకపోలేదు. 

అయినా..ప్రజల భద్రతే ధ్యేయంగా పనిచేయక తప్పదని ఎక్కువ మంది పోలీసులు ఫిక్స్‌ అయిపోయారు . మనం సైలెంట్‌ అయితే...ప్రజల సంగతేమో కానీ, కరోనా వైరస్‌ మాత్రం పడగవిప్పుతుందని పోలీసులకూ తెలుసు. అందుకే కుటుంబ సభ్యుల ఆందోళన, ఒత్తిడిని లెక్క చేయక...ఆరోగ్యాలు దెబ్బతింటున్నా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు 24 గంటలూ పని చేస్తున్నారు పోలీసులు. ఇంత కష్టపడుతున్నా ప్రజల నుంచి ఏ మాత్రం సహకారం అందకపోగా ఎక్కడో ఓ చోట విచక్షణ కోల్పోతే పోలీసులను తిట్టని వారుండరు. వనపర్తి జిల్లాలోనూ అదే జరిగింది పోలీసులతో చాలాసేపు ఓ వ్యక్తి వాగ్వాదం చేసాడు..ఆ సమయంలో పక్కనే ఉన్న అతని కుమారుడు ప్రాధేయపడ్డా పోలీసులు అతనిపై దాడి చేసారు. చిన్నపిల్లాడి ముందే తండ్రిని అలా కొట్టడం నిజంగా తప్పే...అందుకు బాధ్యుడైన ఆ పోలీసు అధికారిని సస్పెండ్‌ చేసారు . 

బట్‌..ఇరవై నాలుగు గంటలూ రోడ్లపై డ్యూటీ చేస్తున్న పోలీసులతో వాగ్వాదం చేయడం కూడా తప్పే కదా...పోలీసులు చెప్పిన వెంటనే తన తప్పును సర్దుకుని ఉంటే..ఇంతదాకా వచ్చేదే కాదు. చిన్న ఇష్యూతో ఓ పోలీసు ఉద్యోగానికి దూరంగా ఉండాల్సి వచ్చింది . ప్రజలు కూడా...పోలీసుల మానసిక స్థితితో ఆటలాడుకోవద్దు. లాక్‌డౌన్‌లో బైటకు రావొద్దు అని నెత్తీ నోరు మొత్తుకున్నా, బైటకు వస్తున్న వారిని ఏమనాలి. ఇలాంటి ఘటనలు...తీవ్ర పని ఒత్తిడిలో ఉన్న పోలీసుల మనోధైర్యాన్ని మరింత దెబ్బతీస్తుందంటున్నాయి పోలీసు అధికారుల సంఘాలు . మేము మీవాళ్లమేనని, మేలు కోరే కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.  

ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ...తనను తాను కాపాడుకుంటూ.. జనాన్ని కాపాడుతూ  పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. కరోనా పై పోరులో పోలీసు పాత్ర గురించి ఒక్కమాటలో  చెప్పలేం.  అందుకే... మనస్పూర్తిగా ఓ సెల్యూట్ కొట్టి వారిని గౌరవించుకుందాం.