అంబటి నోటినుంచి ఆ మాట వినాలనుకుంటున్న పార్టీ నేతలు?

అంబటి నోటినుంచి ఆ మాట వినాలనుకుంటున్న పార్టీ నేతలు?

నాకు కరోనా వచ్చింది. నేను బాగానే ఉన్నాను. నాకు ఫోన్ చేయవద్దంటూ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ పొలిటికల్ సెక్టార్‌లో చర్చకు తెర తీసింది. మూడు ముక్కలు మాట్లాడిన ఆయన ఆ తర్వాత నాలుగో ముక్క కూడా చెప్పేస్తే సరిపోయేది కదా అంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇంతకీ ఆ నాలుగో ముక్క ఏంటి? పార్టీ శ్రేణులు ఏం వినాలనుకున్నాయి? 

సత్తెనపల్లిలో ఏం జరుగుతుందన్నదానిపై చర్చ!

ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు కీలక లీడర్‌. అసెంబ్లీ కావొచ్చు.. బయట కావొచ్చు రాంబాబు నోరెత్తితే ఎదుటివారు సైలెంట్‌ అయిపోతారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన YCPలో కీలక నేతగా కొనసాగుతున్నారు. అలాంటి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రకటించిన రాంబాబు!

సత్తెనపల్లిలో అంబటికి యాంటీ వర్గం కూడా ఉంది. గత ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వొద్దని ఓ సామాజికవర్గానికి చెందిన నేతలు వైసీపీ అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయినా YCPకి వీరవిధేయుడిగా ముద్రపడటంతో అంబటికే పట్టం కట్టారు జగన్‌. సత్తెనపల్లి YCP టికెట్‌ ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇటీవల అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ విషయాన్ని ఆయనే స్వీయ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు. నాకు కరోనా వచ్చింది. నేను బాగానే ఉన్నాను. నాకు ఎవరూ ఫోన్‌ చేయవద్దు అన్నది ఆ వీడియోలో ఉన్న మాటలు.

తమ్ముడు మురళీని కలవండి అని చెప్పేసి ఉంటే సరిపోయేదా?

అయితే స్వీయ వీడియోలో మాట్లాడిన మూడు మాటల తర్వాత ఆ నాలుగో మాట కూడా చెప్పేస్తే బాగుండేది కదా అని అధికార పక్ష నేతలే సెటైర్లు వేస్తున్నారట. నాకు కరోనా వచ్చింది. నేను బాగానే ఉన్నాను. నాకు ఫోన్‌ చేయవద్దు.. ఏమైనా ఉంటే నా తమ్ముడు మురళీని కలవండి అని చెప్పేసి ఉంటే.. అంబటి వీడియో సందేశం సంపూర్ణంగా ఉండేదని  పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. 

సత్తెనపల్లిలో రాంబాబు తమ్ముడు మురళీనే వ్యవహారాలు చక్కబెడతారా?

ఇంతకీ మురళీ పేరు పార్టీ నేతలు ఎందుకు వినాలనుకున్నారంటే.. దానికి కూడా ఓ లెక్క ఉంది. అంబటి రాష్ట్రస్థాయి పొలిటికల్‌ వ్యవహారాల్లో బిజీగా ఉంటున్నారు. ఆయన ప్రకటనలు అన్నీ రాష్ట్రస్థాయి రాజకీయాలు, ఇతరత్రా వ్యవహారలపైనే ఉంటున్నాయి. దీంతో సత్తెనపల్లిలో ఆయన మార్క్‌ పాలన అంతా అంబటి రాంబాబు తమ్ముడు  అంబటి మురళీకే అప్పగించారట.  రాంబాబు గుంటూరులో నివాసం ఉంటున్నారు. నియోజకవర్గానికి వచ్చి పోతుంటారు. ఓ శాసనసభ్యుడిగా ఆయన చెయ్యాల్సిన పనులన్నీ మురళీ కానిచ్చేస్తుంటారట.  నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి కావొచ్చు.. పార్టీ వ్యవహారాలు, అధికారుల బదిలీలు.. ఆఖరికి వీధి దీపాలు, పబ్లిక్‌ కుళాయిల ఏర్పాటు వరకూ పనులన్నీ మురళీకే అప్పగించారని పార్టీ నేతల్లో వినిపించే టాక్‌. 

సత్తెనపల్లిలో మురళీ గురించి అందరికీ అవగాహన ఉందా?

ఈ విషయంపై నియోజకవర్గంలో అందరికీ ఓ అవగాహన ఉంది.  ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఉన్నా లేకపోయినా.. వ్యవహారం ఏదైనా మురళీ ఉంటే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉన్నాయట. సత్తెనపల్లికి వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఓసారి  అంబటి రాంబాబు దృష్టిలో పెట్టి పనులు ఓకే చేస్తారట.  అందుకే స్వీయ వీడియోలో మురళీ మాట కూడా చెప్పేస్తే సరిపోయేదని పార్టీ నేతలు చమత్కరిస్తున్నారు.