ఆ ముగ్గురి నేతల కలలు ఈసారైనా నెరవేరుతాయా ?

 ఆ ముగ్గురి నేతల కలలు ఈసారైనా నెరవేరుతాయా ?

అప్పట్లో ప్రలోభాలకు లొంగలేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధినేతకు అండగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు పవర్‌లోకి రావడంతో కేబినెట్‌ బెర్త్‌ దక్కుతుందని ఆశించారు. ఆ ఛాన్స్‌ దక్కకపోయినా.. తమ నెంబర్‌ వస్తుందని నమ్మకంతో ఉన్నారట. మరి.. ఈ దఫా వారికి పిలుపొస్తుందా? లేక మంత్రి పదవి అందని ద్రాక్షా అని సమాధాన పర్చుకుంటారా? 

విజయనగరం జిల్లా వైసీపీ క్లీన్‌ స్వీప్‌

2019 సార్వత్రిక ఎన్నికల్లో YS జగన్‌కు అండగా నిలిచిన జిల్లాలో విజయనగరం జిల్లా ఒకటి. తొమ్మిదికి తొమ్మిది స్థానాలను YCP క్లీన్ స్వీప్ చేసింది. ఆ మేరకు కేబినెట్‌ బెర్త్ లు వస్తాయని జిల్లా వాసులు అనుకున్నట్లే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన మున్సిపల్ శాఖని సైతం జిల్లాకే కట్టబెట్టారు. మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి చోటు సంపాదించారు. 

ముగ్గురిలో ఒకరికి కేబినెట్‌ బెర్త్‌ ఖాయమనుకున్నారా?

జిల్లాకు కీలక పదవులు రావడం వరకూ బాగానే ఉన్నా.. ముగ్గురు సీనియర్లకు మాత్రం మొండి చెయ్యే మిగిలిందట. కొలగట్ల వీరభద్ర స్వామి, రాజన్నదొర, బొబ్బిలి రాజులను ఓడించిన శంభంగి వెంకట చిన అప్పలనాయుడు మంత్రి పదవి ఆశించారు. జిల్లా నేతలు కూడా ఈ ముగ్గురిలో ఒకరికి  కేబినెట్‌ బెర్త్‌ ఖాయమనుకున్నారట. 
 
ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటారా?
 
అప్పుడు ఎలాగో రాలేదు.. తాజాగా ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్లడంతో ఈ దఫా అయినా ఛాన్స్‌ లభిస్తుందని మళ్లీ ప్రచారం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారాలని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకుని నిలబడ్డామని.. ఇప్పుడు తప్పకుండా తమను పరిగణనలోకి తీసుకుంటారని  ఆశిస్తున్నారట. 
 
సామాజిక సమీకరణాల్లో ఛాన్స్‌ ఉంటుందా?

పార్లమెంట్‌ నియోజకవర్గాలను జిల్లాలు చేస్తారనే ప్రచారం మధ్య ఏజెన్సీలో కీలక నేతగా ఉన్న  రాజన్నదొరకు... ఈసారి తప్పకుండా పిలుపు వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారట. కొలగట్ల  సైతం ఇలాంటి లెక్కల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది . అయితే సామాజిక సమీకరణాల వల్ల  రాజన్నదొర, కొలగట్లకు ఛాన్స్‌ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట పార్టీ నేతలు. రెండేళ్ల తర్వాత ఎలాగూ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం జగన్‌ గతంలోనే స్పష్టం చేయడంతో.. అప్పుడే అదృష్టం కలిసి రావొచ్చని భావిస్తున్నారట. మరి.. జాతకం మధ్యలోనే తిరగబడుతుందో..  అప్పటి వరకూ ఆగాలో కాలమే చెప్పాలి.