ఏపీలో ఐఏఎస్‌ల మెడపై కేసుల కత్తి ?

ఏపీలో ఐఏఎస్‌ల మెడపై కేసుల కత్తి ?

ఏపీలోని IASల మెడపై కేసుల కత్తి వేళ్లాడుతోందా? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్న పరిస్థితుల్లో... IASల వ్యవహరం తెర మీదకు వస్తోందా? ప్రస్తుతం జరుగుతున్న విచారణలే కాకుండా.. ఇంకా దర్యాప్తు చేయబోతున్న విషయాల్లో మరింత మంది గుట్టు బట్టబయలు కాబోతుందా? ప్రస్తుతం ఏపీలోని పరిపాలనా వర్గాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.

చంద్రన్న కానుకలు, ఫైబర్‌ నెట్‌పై సీబీఐ దర్యాప్తు!

ఏపీలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సంక్షేమ పథకాల అమల్లో ఎంత దూకుడుగా ఉన్నారో.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీసే క్రమంలోనూ అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాజధాని భూముల అంశంపై ఇప్పటికే సీఐడీ విచారణ చేపడుతుండగానే.. మరోవైపు లోతైన దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన ఈఎస్ఐ స్కామ్‌పై దర్యాప్తు చేస్తోంది ఏసీబీ. ఇవే కాకుండా చంద్రన్న కానుకలు.. ఫైబర్‌ నెట్‌ వంటి అంశాలపైనా పూర్తిస్థాయి ఎంక్వైరీకోసం సీబీఐతో విచారణ జరిపించాలని కేబినెట్‌లో నిర్ణయించింది జగన్‌ సర్కార్‌.

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మాధురి అరెస్ట్‌!

ఈ అంశాలే ఏపీ పరిపాలనా వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో అరెస్ట్‌లు జరిగాయి. రాజధాని భూముల కేసులో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మాధురి అరెస్టయ్యారు. ఆమెను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడితోపాటు అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్లు అరెస్టయ్యారు. దీంతో రాజధాని భూములు, ఈఎస్ఐ కుంభకోణాల్లో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోననే  చర్చ మొదలైంది. 

వెలుగులోకి భూ సమీకరణలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్‌ పేరు?

రాజధాని భూముల విషయంలో పలువురు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లను సిట్‌ విచారించింది. ఈ క్రమంలో అప్పట్లో భూ సమీకరణలో కీలకంగా వ్యవహరించిన పలువురు తహసీల్దార్ల పేర్లతోపాటు.. గత ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండి.. ల్యాండ్‌ పూలింగ్‌లో కీలక పాత్ర పోషించిన ఓ ఐఏఎస్ పేరు సైతం సిట్‌ దర్యాప్తులో వెలుగు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజధాని భూముల వ్యవహారంలో సదరు ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిని సిట్‌ ముమ్మరం చేసినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

సివిల్‌ సప్లయిస్‌, ఐటీ శాఖల్లో పనిచేసిన ఐఏఎస్‌ల చుట్టూ ఉచ్చు?

చంద్రన్న కానుకలు, ఫైబర్‌ నెట్‌ వంటి అంశాలపై గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడినట్లు గడిచిన కేబినెట్‌లో  సబ్‌ కమిటీ నివేదిక అందజేసింది. దానిపై సీబీఐ విచారణకు కేబినెట్‌ ఆదేశించింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో సివిల్‌ సప్లయిస్‌, ఐటీ శాఖల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

కందిపప్పు సహా నిత్యావసరాల కొనుగోళ్లలో భారీ స్కామ్‌?

2015 నుంచి 2018 వరకూ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌  ఎండీగా, ఆ శాఖ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా విచారణ పరిధిలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.  చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, రంజాన్‌ తోఫా వంటి వాటిల్లో భారీగా అక్రమాలు జరిగాయన్నది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. ఈ క్రమంలో కందిపప్పు సహా ఇంకొన్ని నిత్యావసరాల కొనుగోళ్లల్లో భారీ స్కామ్‌ జరిగిందని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిగ్గు తేల్చింది. దాదాపు 150 కోట్ల రూపాయల మేరా అక్రమాలు జరిగాయన్నది ఉపసంఘం ప్రాథమిక అంచనా. 

ఐఏఎస్‌ల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించిందా?

ఆయా శాఖల్లో పనిచేసిన ఐఏఎస్ లకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ప్రభుత్వం సేకరించి సిద్ధంగా ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ ద్వారా వివిధ ఐఏఎస్ అధికారులకు చెందిన ఆస్తులు.. ఆదాయాలపై జాబితాను రెడీ చేసిందట. ఓ ఐఏఎస్ అధికారికి వేల కోట్ల రూపాయాల ఆస్తులున్నట్లు  ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది.  హైదరాబాద్‌ గోపన్నపల్లెలో ఆరెకరాలు, శంకర్‌పల్లిలో రెండు ఫామ్‌ హౌస్‌లు, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఓ బంగ్లా, అలాగే వెంగళరావు పార్క్‌ సమీపంలోని ఒకే కాంప్లెక్స్‌లో 22 ఫ్లాట్లు ఉన్నట్లు  గుర్తించినట్టు తెలుస్తోంది.

వైజాగ్‌లోనూ బినామీ పేర్లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం?

రాజధాని వైజాగ్‌ వెళ్తోన్న విషయంపై స్పష్టత రాగానే అక్కడ కూడా బినామీ పేర్లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన ఓ ఉన్నతాధికారికి సంబంధించిన లెక్కలన్నీ పక్కాగా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు సమాచారం. సీబీఐ విచారణ మొదలైతే.. ఈ సమాచారాన్ని ప్రభుత్వం దర్యాప్తు అధికారులకు సిద్ధంగా ఉందట. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ  ఉన్నతాధికారుల్లో వణుకు ప్రారంభమైంది. ఈ వ్యవహారం నాటి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేవారికే పరిమితమవుతుందా? లేక అధికారుల మెడకు చుట్టుకుంటుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.