టీడీపీ జండా మోయడానికి ఆ జిల్లాలో నేతలే లేరా..?

టీడీపీ జండా మోయడానికి ఆ జిల్లాలో నేతలే లేరా..?

ఒకప్పుడు ఆ జిల్లాలో టీడీపీ రారాజుగా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు పార్టీకి దిక్కులేకుండా పోయింది. లీడర్లు ముసుగుతన్ని పడుకుంటే.. కేడర్‌ మనకెందుకులే అని అనుకుంటోంది. ఎవరిని కదిలించినా గతమెంతో ఘనకీర్తి అని పాట పాడుకుంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 


ఐదేళ్లు తిరిగే సరికి ప.గో.జిల్లాలో టీడీపీ సీన్‌ రివర్స్‌!

ఏపీ రాజకీయాల్లో పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుంది.  ఇక్కడి జనం ఎన్నికల్లో ఎటు మొగ్గు చూపితే.. అధికారం అదే పార్టీకి దక్కుతుందనే నానుడి ఉంది. 2014, 2019 ఎన్నికల్లో అదే జరిగింది. 2014లో జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను బీజేపీతో కలిసి టీడీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తే.. 2019లో టీడీపీకి దక్కిన అసెంబ్లీ స్థానాలు రెండే రెండు. ఐదేళ్లు తిరిగే సరికి వారు వీరయ్యారు.. వీరు వారయ్యారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. 

అప్పట్లో తొడకొట్టిన నాయకులు ఒక్క ఓటమితో గాయబ్‌!

జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లోనే సైకిల్‌ నిలబడింది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు  అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా మా కంచుకోట అని తొడలు కొట్టిన నాయకులు.. 2019 ఇచ్చిన ఓటమితో ఈ రాజకీయాలు మాకెందుకునే అని డీలా పడిపోయారు. టీడీపీ నేతలకు  బూస్ట్‌ ఇద్దామని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా పోరాడటానికి ఒక్కరూ సిద్ధంగా లేరట. 

జరుగుతున్న పరిణామాలు చూసి అంతా సైలెంట్‌!

గతంలో మంత్రులుగా, విప్‌లుగా పనిచేసిన వారంతా జరుగుతున్న పరిణామాలను చూసి గప్‌చుప్‌ అయ్యారు. టీడీపీతో మాకేం సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారట. పితాని సత్యానారాయణ, జవహర్‌ సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. పితానిని ESI స్కామ్ వెంటాడుతోంది. అప్పుడప్పుడూ నేనున్నాను అనే జవహర్‌ సైతం ఎక్కడున్నారో తెలియడం లేదట. 

ఉండి ఎమ్మెల్యే రామరాజు వైసీపీ వైపు చూస్తున్నారా?

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఒక్కరే ఒంటరి పోరు చేస్తున్నారు. ఆయన పోరు కూడా పాలకొల్లుకే పరిమితం అవుతోంది. ఆయనకు జత కలిసే నాయకులు ఒక్కరూ కనిపించడం లేదు. అదే అసెంబ్లీ ఉంటే మాత్రం.. సభలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు పార్టీలో ఉన్నారో లేదో తెలియడం లేదని తెలుగు తమ్ముళ్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పైగా రామరాజు వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. 

చింతమనేని గాండ్రించే పరిస్థితి లేదా?

మరో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కేసుల చట్రంలో ఇరుక్కుపోయారు. ఆయన కాలు బయటపెట్టినా.. నోరు తెరిచి ఏం మాట్లాడినా తీసుకెళ్లిపోవడానికి పోలీసులు రెడీగా ఉంటున్నారట. దాంతో ఆయన గాండ్రించే పరిస్థితి లేదని తెలుగు తమ్ముళ్లు గుస గుసలాడుకుంటున్నారు. అంతేకాదు. దూకుడుగా ఉండే తన అనుచరులను, కార్యకర్తలను సైతం సైలెంట్‌గా ఉండండిరా బాబు.. ఎందుకొచ్చిన గొడవ అని చెబుతున్నారట. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఉన్నా లేనట్టే అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ మంత్రి పీతల సుజాత యాక్టివ్‌గా లేరు. 

టీడీపీ జెండా పట్టుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదా?

ఒకప్పుడు జిల్లా నిండా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో పసుపు జెండాలు రెపరెపలాడిన చోట ఇప్పుడు జెండా పట్టుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎంతోకొంత దగ్గరగా ఉండిఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని కేడర్‌ కామెంట్స్‌ చేస్తోందట. పరిస్థితి చూస్తుంటే.. జిల్లాలో మళ్లీ పచ్చ జెండా ఎగురుతుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.