పర్చూరు ఎమ్మెల్యే యూ టర్న్‌ తీసుకున్నారా?

పర్చూరు ఎమ్మెల్యే యూ టర్న్‌ తీసుకున్నారా?

 ఆ ఎమ్మెల్యేపై అధికార పార్టీ కన్నేసింది. గేలానికి కూడా తగిలారు. చర్చలు కూడా అయిపోయాయి. లెక్కలన్నీ పక్కాగా చూసుకున్న తర్వాత.. ఇటు నుంచి అటు వెళ్లడానికి ముహూర్తాలు సైతం పెట్టుకున్నారు. కానీ... వన్‌ ఫైన్‌ మాణింగ్‌  నో.. నో.. నేను అలాంటోన్ని కాదు.. రాముడు మంచి బాలుడు టైప్‌ అనేశారు. ఈ రేంజ్‌లో ఎమ్మెల్యే షాక్‌ ఇవ్వడంతో తేరుకోవడానికి అందరికీ టైమ్‌ పట్టిందట. 

దగ్గుబాటిని ఓడించడంతో అందరి దృష్టీ ఆకర్షణ! 

ప్రకాశం జిల్లా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రెండు నెలలుగా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. పర్చూరు నియోజకవర్గం నుంచి 2014, 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. 2019లో వైసీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఓడించడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. 

వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో చిక్కుకున్నారు!

రెండోసారి ఎమ్మెల్యే అయినా ఏం లాభం. టీడీపీ ఘోర పరాజయంతో ఏలూరి రాజకీయంగా సైలెంట్‌ అయిపోయారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలను వైసీపీ నాయకులు చక్కబెట్టడంతో అటు వైపు చూడకుండా తన పని తాను చేసుకుపోయారు. ఏడాది తిరిగే సరికి వైసీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో ఏలూరి చిక్కుకున్నారు.

నోవా అగ్రిటెక్‌ ప్రధాన ఆదాయ వనరు!

ఏలూరి సాంబశివరావుకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నోవా అగ్రిటెక్ అనే ఎరువులు, వ్యవసాయోత్పత్తుల కంపెనీపై ప్రభుత్వం వేటు వేసింది. దీంతో నోవా అమ్మకాలు ఏపీలో నిలిచిపోయాయి. రాజకీయాల్లోకి రాకముందు నుండి ఆయనకు నోవా అగ్రిటెక్ కంపెనీ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.  బిజినెస్‌కు బ్రేక్‌ పడేసరికి ఎమ్మెల్యే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. 

రూ.150 కోట్ల పెండింగ్‌ బిల్లులు రావాలి?

గత ప్రభుత్వంలో పర్చూరు నియోజకవర్గంలో చేసిన పనులకు సంబంధించి ఏలూరికి 150 కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తే నోవా అగ్రిటెక్ అమ్మకాలకు అనుమతులతోపాటు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అధికార పార్టీ నుంచి ఆఫర్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే పర్చూరు నియోజకవర్గంలో అధికార పెత్తనం ఇస్తామని హామీ ఇచ్చినట్టు టాక్. 

పార్టీ మారడం లేదని ప్రకటించేసిన ఏలూరి!

హైదరాబాద్‌ కేంద్రంగా ఎమ్మెల్యే ఏలూరితో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు కూడా జరిపారట. అదే సమయంలో టీడీపీ మహానాడుకు ఎమ్మెల్యే ముఖం చాటేశారట. ఇంకేముంది జంపింగ్‌ సమయం వచ్చేసిందని..ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యమని అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఏలూరి ఊహించని షాక్‌ ఇచ్చారు. పార్టీ మారడం లేదని ప్రకటన చేశారు. 

టీడీపీ ముఖ్యనేతలు బుజ్జగించారా?

అధికార పార్టీ నేతలతో చర్చలు జరిపిన ఏలూరి ఎందుకు యూటర్న్ తీసుకున్నారో అని అనుచరులు ఆరా తీసే పనిలో పడ్డారట. టీడీపీకి విధేయుడుగా ఉన్న ఆయన చేజారిపోతే నియోజకవర్గంలో ఇబ్బందులు తప్పవని తెలుగుదేశం ముఖ్యనేతలు ఎమ్మెల్యేని బుజ్జగించారని టాక్ వినిపిస్తోంది. నోవా అగ్రిటెక్ సంస్థలో ఇతరులతో పెట్టుబడులు పెట్టించి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూస్తామని  టీడీపీ పెద్దలు హామీ ఇచ్చినట్టు టాక్.

నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారా?

నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నాయకులు కూడా ఏలూరి సాంబశివరావు వైసీపీలో చేరికని వ్యతిరేకించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏలూరి సాంబశివరావు తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి కండువా మారిపోయేదని టాక్. 

త్వరలోనే పార్టీ మారతారని లీకులు ?

ఏలూరి సాంబశివరావు పార్టీ మారనంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పినా.. వైసీపీ నాయకులు మాత్రం త్వరలోనే ఆయన పార్టీ మారతారంటూ జిల్లాలో లీకులు ఇస్తున్నారట. దీంతో ఎమ్మెల్యే వ్యవహారం జిల్లాలో ఆసక్తిగా మారింది. ఇప్పటికే టీడీపీని వీడి అధికార పార్టీకి మద్దతు తెలియజేసిన నేతల్ని ఆదర్శంగా తీసుకుంటారా లేక ఇబ్బందులు ఎదురైనా ప్రతిపక్ష పార్టీలోనే కొనసాగుతారా అన్న చర్చ జరుగుతోంది. మరి ఏలూరి తన పొలిటికల్ ఫ్యూచర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.