అర్ధరాత్రి ధర్నాలతో కొత్త రాజకీయానికి తెరతీశారా?

అర్ధరాత్రి ధర్నాలతో కొత్త రాజకీయానికి తెరతీశారా?

ఆయనో మాజీ మంత్రి. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను, యంత్రాంగాన్ని కనుసైగలతో శాసించేవారు. ఇప్పుడు ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉంది. అయినా ఏదో అసంతృప్తితో ఉన్నారు. సత్తా చాటాలని అనుకుంటున్నారో ఏమో కానీ.. అర్ధరాత్రిళ్లు ఆయన చేస్తున్న హడావిడి కలకలం రేపుతోందని టాక్‌. ఇంతకీ ఎవరా నేత? 

కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు!

ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత మానుగుంట మహిధర్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి  మూడుసార్లు శాసనసభ్యుడిగా ఉంటే.. మొన్నటి ఎన్నికల్లో YCP నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి  కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. అమాత్యుడిగా ఉన్నప్పుడుగానీ.. కాంగ్రెస్‌ రాజకీయాలు ఓ రేంజ్‌లో నడుస్తున్నప్పుడు గానీ.. సీనియర్‌ రాజకీయ వేత్తగా ప్రకాశం జిల్లాలో ఓ వెలుగు వెలిగారు మహిధర్‌రెడ్డి. ఆయన చెప్పిందే వేదం..చేసిందే శాసనంలా ఉండేది. అలాంటి నేతకు ఇప్పుడు అంతా రివర్స్‌ కాలం నడుస్తుందన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపించే మాట. 

2014 తర్వాత పాలిటిక్స్‌కు ఐదేళ్లు లాంగ్‌ లీవ్‌!

కందుకూరు నియోజకవర్గంలో మహిధర్‌రెడ్డి కుటుంబానికి ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. ఆయన తండ్రి ఆదినారాయణరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా తండ్రి రికార్డును బ్రేక్‌ చేశారు మహిధర్‌రెడ్డి. అందుకే ఆయనకు కందుకూరులో మంచి పట్టు ఉందని అంటారు. రాష్ట్ర విభజన ఎఫెక్టో ఏమో కానీ.. 2014 నుంచి ఐదేళ్లు లాంగ్‌ లీవ్‌ తీసుకున్నట్లు సైలెంట్‌ అయ్యారు. 

తాగునీటి సమస్య పరిష్కారం కోసం అర్ధరాత్రి ఆందోళన!

2019లో YCP ఎమ్మెల్యేగా గెలిచినా కందుకూరుకే పరిమితం అయ్యారాయన. రాష్ట్రంలో YCP అధికారంలో ఉన్నా.. తాను ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా.. అధికారులు మాట వినడం లేదన్నది మహిధర్‌రెడ్డి ఆరోపణ. తాగునీటి సమస్య కోసం ఒంగోలు జడ్పీ ఆఫీసు వద్ద అర్ధరాత్రి ఒంటగంట వరకూ హడావిడి చేయడం అధికార పార్టీలో కలకలం రేపింది. అధికారుల తీరువల్ల నియోజకవర్గంలో కనీస సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నామని మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దెబ్బకు సమస్య పరిష్కారమైనా.. మహిధర్‌రెడ్డి వైఖరి జిల్లాలో చర్చకు దారితీసింది. 

పవర్‌ కోసం అసంతృప్తి వాదిగా మారుతున్నారా?

తాజాగా జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి కలెక్టర్‌ సరిగా పనిచేయడం లేదని పదే పదే ఆరోపిస్తున్నారు. జిల్లాలో కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్యేల మాటకే అధికారులు విలువ ఇస్తూ మిగతా ప్రజా ప్రతినిధులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారాయన. దీంతో ఒకప్పుడు మంత్రిగా పనిచేసి నాయకుడికి ఏమైంది అని చర్చించుకుంటున్నారట జనం. పవర్‌ చూపించాలనే తాపత్రయంలో అసంతృప్తి వాదిగా మారుతున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయట. 

ఆధిపత్య పోరువల్లే రోడ్డెక్కుతున్నారా?

కేవలం నియోజకవర్గ సమస్యలపై ఈ స్థాయిలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆందోళనలు చేయడం ఏంటని చెవులు కొరుక్కునేవారు కూడా ఉన్నారట. జిల్లాలో ఉన్న ఆధిపత్య పోరువల్లే రోడ్డెక్కుతున్నారా లేక ఇంకేదైనా పదవి ఆశించి ఇలా చేస్తున్నారా అన్నది తెలియడం లేదట. మరి.. మహిధర్‌రెడ్డి ఇలాగే ఉంటారో..  మనసులో మాట బయటపెట్టి కొత్త అడుగులు వేస్తారో కాలమే చెప్పాలి.