కోఆప్షన్‌ సభ్యుల కోసం టీఆర్‌ఎస్‌లో పైరవీలు!

కోఆప్షన్‌ సభ్యుల కోసం టీఆర్‌ఎస్‌లో పైరవీలు!

కో ఆప్షన్‌ పదవి కావాలంటే.. నేతలు ఇస్తున్న ఆప్షన్‌ ఏంటి? పదవి కోసం ఆరాట పడుతున్నవారి రియాక్షన్‌ ఎలా ఉంది? మంత్రులు, ఎమ్మెల్యేలు కరుణించినా.. చదివింపులు ఉండాల్సిందేనా? తెలంగాణలో స్థానిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కడానికి కారణం ఏంటి? లెట్స్‌ వాచ్‌.


కోఆప్షన్‌ సభ్యుల కోసం టీఆర్‌ఎస్‌లో పైరవీలు!

తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక జాతర మొదలైంది. పలుచోట్ల పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పదవులు దక్కించుకునేందుకు ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. టీఆర్‌ఎస్‌లో  పైరవీలకు తెరలేచింది. కోఆప్షన్‌ సభ్యులుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అడుగుపెట్టేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మైనారిటీ వర్గాలతోపాటు ఆయా రంగాల్లో అనుభవం ఉన్నవారిని ఈ పదవుల్లోకి తీసుకుంటారు. 

రూ.50 లక్షలకుపైగా ఖర్చు చేసేందుకు నేతలు సిద్ధం?

ఇంత వరకూ బాగానే ఉన్నా.. హైదరాబాద్‌ శివారుల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కో ఆప్షన్‌ సభ్యుడు అనిపించుకునేందుకు  కొందరు 50 లక్షలకుపైనే ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల  25 లక్షల నుంచి  50 లక్షలు ఇచ్చేందుకు రెడీ ఉన్నారట. రిజర్వేషన్ల వల్ల చాలా చోట్ల మహిళలే కౌన్సిలర్లు, కార్పొరేటర్లగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కోఆప్షన్‌ సభ్యులుగా ఎంట్రీ ఇచ్చేందుకు వారి భర్తలు పావులు కదుపుతున్నారట. 

బోడుప్పల్‌, ఫిర్జాదిగూడలో ఓ మంత్రి అల్లుడు పర్యవేక్షణ!

అధికార పార్టీ చేతిలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతో టీఆర్‌ఎస్‌ నేతల నుంచే పోటీ ఎక్కువగా ఉందని సమాచారం. హైదరాబాద్‌ శివారు బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ కార్పొరేషన్లలో కోఆప్షన్ల సభ్యుల ఎంపిక మొత్తం ఓ మంత్రి అల్లుడు కనుసన్నల్లో నడుస్తోందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన  పోటీ చేసే ఆలోచనలో ఉండటంతో వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ఎంతఖర్చు అయినా పర్వాలేదని.. తన వర్గంవారు గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. 

మణికొండలో 4 పదవులకు 16 నామినేషన్లు!

నిజాంపేట కార్పొరేషన్‌లో ఎన్నికకు కాస్త గడువు చిక్కడంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లను, సీనియర్‌ నాయకులను కలిసి మద్దతు కోరేవారు ఎక్కువయ్యారట.  అవసరమైతే అరకోటి ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడటం లేదని టాక్‌. బండ్లగూడలో మొత్తం ఐదు కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం 14 నామినేషన్లు వచ్చాయి.  మణికొండ మున్సిపాలిటీలో నాలుగు స్థానాల కోసం 16 నామినేషన్లు దాఖలు కావడంతో పోటీ తీవ్రంగా ఉందని.. నేతల ఆప్షన్లు కూడా అదే స్థాయిలో పెరుగుతోందని అంటున్నారు. మొత్తానికి ఎన్నిక ఏదైనా.. పైరవీలు.. అర్థ అంగబలం  ముఖ్యమైపోయాయనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.