టీడీపీ సరికొత్త పావులు పార్టీకి కలిసి వస్తాయా.. లేదా?

టీడీపీ సరికొత్త పావులు పార్టీకి కలిసి వస్తాయా.. లేదా?

అప్పుడే ఢిల్లీ బాట పట్టారా? అటు నుంచి నరుక్కొస్తే పని అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారా? కరోనా సమస్య తీవ్రంగా ఉన్నా.. హస్తిన వెళ్లడం వెనుక ఆ పార్టీ వ్యూహం ఏంటి? ఇదే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఆర్నెళ్ల కాలంలోనే మూడుసార్లు రోడ్డెక్కిన చంద్రబాబు!

ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల నుంచే టీడీపీ రోడ్డెక్కుతోంది. రాజకీయ రచ్చ మొదలైంది. ప్రజావేదిక కూల్చివేత మొదలు పల్నాడు ఉద్రిక్తతలు, కార్యకర్తలపై కేసుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెళ్ల కాలంలోనే మూడుసార్లు రోడ్డెక్కారాయన.  ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులపై కేసుల గురించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పలు అంశాలపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదులు చేశారు చంద్రబాబు. 

రాష్ట్రపతిని కలిసి 52 పేజీల వినతిపత్రం అందజేత!

ప్రస్తుతం కోర్టుల దగ్గర నుంచి సోషల్‌ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. ఇన్నాళ్లు రాష్ట్రస్థాయిలోనే వివిధ అంశాలపై ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కిన టీడీపీ ఎందుకో సడెన్‌గా ఢిల్లీ గేటు తట్టింది. స్వయంగా రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి 52 పేజీల ఫిర్యాదు అందజేసింది. రాష్ట్రపతిని కలిసిన బృందంలో నలుగురు టీడీపీ ఎంపీలు ఉన్నారు. అమరావతి నుంచి మొదలుకొని కోడెల కుమారుడుపై కేసుల వరకూ ఆ వినతిపత్రంలో ప్రస్తావించారు. వందకుపైగా టీడీపీ నేతలపై పెట్టిన కేసుల వివరాలను, సెక్షన్లను వివరించారు. 

కరోనా సమయంలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేశారు?

ఇప్పటికే ఏపీలో గవర్నర్‌ను కలిసిన టీడీపీ.. తాజాగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఎందుకు ఫిర్యాదు చేసిందనే చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆందోళనలు చేసినా.. అరెస్ట్‌లు, వేధింపులు ఆగడం లేదన్నది ప్రతిపక్ష నేత మాట. అందుకే రాష్ట్రంలో పరిస్థితులను ఢిల్లీ స్థాయిలో రిజిస్టర్‌ చేయాలని టీడీపీ భావిస్తోందట. ఇప్పటికిప్పుడు సందర్భం లేకపోయినా.. కరోనా సమస్య తీవ్రంగా ఉన్నా.. హస్తినకు వెళ్లడం చర్చకు దారితీసింది.  రానున్న రోజులలో ఏవైనా ఊహించని పరిణామాలు జరిగితే.. తాము ముందే చెప్పాం అని అనడానికి ఈ ఫిర్యాదులు ఉపయోగపడతాయని భావిస్తున్నారట టీడీపీ నేతలు. అంతేకాదు.. రాష్ట్రపతికి  ఫిర్యాదులు వెళ్లితే ఎంతో కొంత భయం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. 

కేంద్రమంత్రులను తరచూ కలుస్తున్న టీడీపీ నేతలు?

ఆ మధ్య పోలీస్‌ ఉన్నతాధికారులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే టైమ్‌లో ఢిల్లీ పెద్దలకు పదే పదే ఫిర్యాదులు చేస్తే.. ఒకసారి కాకపోతే మరోసారి అయినా వాటిపై ఫోకస్‌ పెడతారని  అనుకుంటున్నారట. కేంద్రమంత్రులను కూడా తరుచుగా టీడీపీ నేతలు కలుస్తున్నట్లు సమాచారం. ఏపీలో నరేగా పనులపై ఇప్పటికే చంద్రబాబు పలు లేఖలు రాశారు. ఇలా చేస్తే కేంద్రం నుంచి రాష్ట్ర సర్కార్‌పై ఒత్తిడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఫిర్యాదుల రాజకీయం టీడీపీకి ఎంత వరకూ కలిసి వస్తుందో చూడాలి.