ఇప్పటికయినా జగన్ సర్కార్ కు ఇసుక తలనొప్పి వదులుతుందా ?

ఇప్పటికయినా జగన్ సర్కార్ కు ఇసుక తలనొప్పి వదులుతుందా ?

ప్రత్యేక పాలసీని తీసుకొచ్చినా ఇసుక విషయంలో ఏపీ ప్రభుత్వం ఆశించినట్లు జరగడం లేదు. ఎక్కడో ఒక లోపం ఉండటంతో చికాకు పెడుతోంది. ఇక లాభం లేదనుకుని ఆ అంశంపైనే మంత్రి ఫోకస్‌ పెట్టారు. ఈ సందర్భంగా ఆయనకో విషయం తెలిసిందట. అంతే ప్రక్షాళన అస్త్రాన్ని బయటకు తీస్తున్నారట. 

సంస్కరణలు తెచ్చినా సమస్య కొలిక్కి రాలేదా?
 

జగన్ ప్రభుత్వాన్ని వదల బొమ్మాళి అంటూ వెన్నంటి ఉండి ఇబ్బంది పెడుతున్న సమస్య ఇసుక. పరిపాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇసుక అంశం ప్రభుత్వానికి కొరుకుడు పడటం లేదు. ఇసుక మాఫియాను అరికడుతున్నామని అనేక సంస్కరణలు తెస్తున్నామని పదేపదే చెప్పినా సమస్య ఓ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అంశంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. 

గుట్టుగా సమాచారం సేకరించిన మంత్రి పెద్దిరెడ్డి!

ఈ మొత్తం వ్యవహరానికి కారణమేంటి? ఇసుక సమస్య గాడిన పడకపోవడానికి కారకులెవ్వరు అన్నదానిపై APMDCలో జరుగుతున్న తతంగంపై దాదాపు రెండు నెలల నుంచి మంత్రి పెద్దిరెడ్డి గుట్టు చప్పుడు కాకుండా సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. 

ప్రభావితం చేస్తున్నవాళ్లు ఏపీఎండీసీలో ఉన్నారా?
 

మంత్రి సేకరించిన సమాచారంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో పాటు ఇంకొందరు ప్రభావితం చేసే వ్యక్తులు APMDC చుట్టూ చేరారని అమాత్యుల వారికి తెలిసిందట. ప్రభుత్వం భావించిన విధంగా ఇసుక పాలసీ అమలు జరగకపోవడానికి ప్రధాన కారణం అదేనని పెద్దిరెడ్డికి ఫీడ్ బ్యాక్‌ వచ్చినట్టు సమాచారం. 
 

పక్కా ఆధారాల కోసం ఇంటర్నల్‌ ఆడిట్‌?
 

ఈ సందర్భంగా కొందరు అధికారుల బాగోతం కూడా మంత్రి దృష్టికి వచ్చిందట. అంతర్గతంగా మరింత సమాచారాన్ని సేకరించే దిశగా పక్కా ఆధారాలను రాబట్టేందుకు ఇంటర్నల్‌ ఆడిట్‌ నిర్వహించినట్టు తెలుస్తోంది. తనకు వచ్చిన సమాచారం, ఇంటర్నల్‌ ఆడిట్‌ ద్వారా తెలిసిన విషయాల మధ్య సారూప్యత ఉన్నట్లు గుర్తించిన మంత్రి ఆ మేరకు చర్యలకు ప్రారంభించారట.

మధుసూదన్‌రెడ్డిసహా పలువురికి ఉద్వాసన !
 

APMDC ఎండీగా ఉన్న మధుసూదన్‌ రెడ్డి సహా ఇంకొందరిని తప్పించారు. అవినీతికి అలవాటు పడిన అధికారులు.. సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిని పైనుంచి మొదలుపెట్టి క్షేత్రస్థాయి వరకూ ఉన్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని కూడా సాగనంపారు. APMDCకి చెందిన ఉద్యోగులనే సంస్థలో నియమించడం వెనుక మంత్రి చేసిన కసరత్తే కారణమని చర్చ జరుగుతోంది. 

పాలసీని సమూలంగా మార్పులు చేస్తున్నారా?
 

అంతేకాదు.. ఇసుక పాలసీ అమలులో ఉన్న లోపాలను స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి పూర్తిస్థాయిలో వివరించినట్లు సమాచారం. దానికి అనుగుణంగానే ఇసుక విధానాన్ని సమూలంగా మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్‌ చేసుకోవడం.. నదికి సమీపంలో ఉన్న గ్రామాల వారు ఎడ్లబళ్లు, ట్రాక్టర్లపై ఉచితంగా  ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కల్పించడం ఈ చర్యల్లో భాగంగా వివరిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మరో చర్చ మొదలైందట. అధికార గణాన్ని దారిలో పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి ఏ స్థాయిలో చర్యలు తీసుకున్నారో.. అలాగే ఇసుక రీచ్‌లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలపైనా ఫోకస్‌ పెడితే ప్రక్షాళనకు పరిపూర్ణత వస్తుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి.. ఆ దిశగా సర్కార్‌ అడుగులు వేస్తుందో లేదో చూడాలి.